Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇటీవల కాలంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగా యనీ, ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటేనే కరోనాను నియంత్రించేందుకు వీలవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని సూచించింది. కోవిడ్ నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. అదే విధంగా కరోనాతో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసే విషయంలో చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 22 జరిగే తదుపరి విచారణలోగా సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై దాఖలైన పలు పిల్స్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయనీ, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కరోనా వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.
కేంద్రానికి హైకోర్టు నోటీసులు
ఇస్లామ్ కరోనా వైరస్, ఇస్లాం కరోనా జీహాద్, ఇస్లాం కరోనా ఫోబియా, కరోనా తబ్లిగ్ జీహాద్ వంటి పేర్లతో ఇస్లాం మతస్తుల మనోభావాలను ట్విటర్ ద్వారా దెబ్బతీశారన్న కేసులో కేంద్ర హౌం శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తరహాలో ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన వారిపైనా, ట్విట్టర్‌పైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ లాయర్ ఐజాజుద్దీన్ పిల్ వేశారు. పిటిషన్‌లోని ఆరోపణలపై దర్యాప్తు చేసి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ పిటిషనర్ కోర్టు ధిక్కార రిట్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర హౌం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
మహావీర్ మెడికల్ కాలేజీ రిట్ కొట్టివేత
వికారాబాద్‌లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రమాణాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు, సాంకేతిక వసతులు లేని కారణంగా ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల అడ్మిషన్లను రద్దు చేసిన వ్యవహారం హైకోర్టుకు చేరింది. వాటిని రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) తీసుకున్న నిర్ణయాన్ని కాలేజీ యాజమాన్యం హైకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఎంఎన్సీలోని కమిటీ ఎదుట కాలేజీ దరఖాస్తు చేసుకున్నది. దీనిపై కమిటీ నిర్ణయం తీసుకోకుండానే హైకోర్టులో రిట్ దాఖలు చేయడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. కమిటీ దగ్గరే తేల్చుకోవాలనీ, అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే హైకోర్టుకు రావచ్చునని స్పష్టం చేసింది.