Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), కాంగ్రెస్ నేతల స్వాగతం
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
పోడు భూముల కేసులో ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న ఆదివాసీ మహిళలు బుధవారం విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడకు చెందిన 12మంది ఆదివాసీ మహిళలను పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి జిల్లా జైలుకు పంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అరెస్టులను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు జైలుకు వచ్చి ఆదివాసీ మహిళలను పరామర్శించారు. బుధవారం జిల్లా జైలు నుంచి విడుదలైన ఆదివాసీ మహిళలకు జన్నారంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం వారి వెంట కోయపోశగూడకు వెళ్లారు.
కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత కూడా ఆదివాసీ మహిళలకు స్వాగతం పలికారు. మోదితే పోసవ్వ, మాదికుంట శాతవ్వ, రజిత, గుడిపెల్లి లక్ష్మి, గుడిపెల్లి పెద్ద లక్ష్మి, మాదికుంట శైలజ, జైనేని లావణ్య, దోసండ్ల లచ్చవ్వ, దోసండ్ల సునీత, దోసండ్ల శ్యామల, దోసండ్ల గంగవ్వ, మాదికుంట రాజవ్వను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్కరించారు. అనంతరం వారికి బట్టలను అందించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పోడు వ్యవసాయం చేసుకునే వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు. దౌర్జన్యం చేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.