Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు అభిలాష గొడిశాల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ నేతల మతవిద్వేష వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు అభిలాష గొడిశాల తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె కువైట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్ వైపు అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నాయని తెలిపారు. వారు మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. కువైట్ లో కూడా కొన్ని సహకార సంస్థలు భారతీయ ఉత్పత్తులను తొలిగించాయని ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు, అందులో 15 లక్షల మంది తెలంగాణ వారు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజరు మసీదులను తవ్వుదాం..శవాలు బయటపడితే మీకు, శివ లింగాలు బయటపడితే తీసుకుంటాం అని రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి నేతల మాటలతో కుటుంబాలను వదులుకుని ఆదాయం కోసం గల్ఫ్ దేశాలకొచ్చిన వారు రోడ్డున పడే ప్రమాదముందనీ, భారతదేశానికి - గల్ప్ దేశాలతో స్నేహ సంబంధాలు తెగిపోవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కువైట్, దుబారు, ఖతార్, ఒమన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా దేశాలు.... తమ దగ్గరున్న భారత రాయబారులకు సమన్లు ఇచ్చాయని తెలిపారు. భారత్లో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయా దేశాలు కోరినట్టు అభిలాష వెల్లడించారు. రాజకీయంగా లబ్ధి కోసం బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారనీ, ఈ మత విద్వేషాల ఉచ్చులో పడితే దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రపంచమంతా మనవైపు వేలెత్తి చూపిస్తే, ఆయా దేశాల్లో ఉన్న మనదేశ పౌరుల పరిస్థితి ఏమవుతుందో దేశ ప్రజలు ఆలోచించాలని అభిలాష కోరారు.