Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ
- ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు
- అయినా స్పష్టత ఇవ్వని టీఎస్పీఎస్సీ
- 3.80 లక్షల మంది దరఖాస్తు
- ఆందోళనలో అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జారీచేసి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కానీ ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహిస్తారన్న తేదీని ఇంత వరకు ప్రకటించకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో టీఎస్పీఎస్సీ తీరుపై అభ్యర్థులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి గతంలో ఎప్పుడూ లేని విధంగా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గతనెల రెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వాటి సమర్పణకు షెడ్యూల్ ప్రకారం గతనెల 31 వరకే ఉన్నది. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఈనెల నాలుగో తేదీ వరకు టీఎస్పీఎస్సీ పొడిగించింది. దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముగిసింది. గ్రూప్-1కు మొత్తం 3,80,202 దరఖాస్తులొచ్చాయి. అయినా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని ప్రకటించకపోవడం పట్ల పలు విమర్శలొస్తున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి నెలన్నర అవుతున్నా, దరఖాస్తు గడువు ముగిసినా టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జులై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుందని నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ ఇంతవరకు తేదీని ప్రకటించకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం లేదా? ఏదైనా సాంకేతిక, ఇతర కారణాలున్నాయా? అన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ప్రయివేటు కోచింగ్ సెంటర్ల కోసమేనా?
గ్రూప్-1 కోచింగ్‌తో హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలూ నిరుద్యోగ యువతతో కళకళలాడుతున్నాయి. దీంతో కోచింగ్ సెంటర్లకు కాసుల వర్షం కురుస్తున్నది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా నోటిఫికేషన్లు వచ్చినపుడే నిరద్యోగుల నుంచి అందినకాడికి దోచుకోవాలి అన్న చందంగా నిరద్యోగుల నుంచి అందినకాడికి దోచుకోవాలి అన్న చందంగా కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజు తీసుకుంటున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్ పూర్తిచేయడం, ఆ తర్వాత అభ్యర్థులు సన్నద్ధం కావాలంటే సమయం కావాలి. ఇంకోవైపు అభ్యర్థుల నుంచి ఫీజులను దండుకోవచ్చన్న కుట్ర చేస్తున్నాయి. దీంతో తక్కువ సమయంలో కాకుండా మూడు, నాలుగు నెలల తర్వాత నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కోచింగ్ కేంద్రాల యజమానులు వచ్చినట్టు తెలిసింది. అందుకే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం అందుకు అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంకోవైపు రాజకీయంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు భవిష్యత్తులో ఉంటాయి. ఇప్పటికే 587 ఎస్ఐ, 16,929 కానిస్టేబుల్ కలిపి 17,516 పోస్టుల భర్తీకి 7,33,559 మంది అభ్యర్థులు 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఎస్ఐ అభ్యర్థులకు ఆగస్టు ఏడు, కానిస్టేబుల్ అభ్యర్థులకు అదేనెల 21న ప్రిలిమినరీ రాతపరీక్షలుంటాయని పోలీసు నియామక బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ కొంత ఆలస్యంగా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసి, వాటి రాతపరీక్షలకు నిరుద్యోగ అభ్యర్థులను సన్నద్ధం చేస్తే ఇతర పార్టీల వైపు వారి దృష్టి మళ్లించకుండా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తక్కువ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. గ్రూప్-1 కోసం ప్రశాంతంగా చదువుకోవాలంటూ కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు అధ్యాపకులు చెప్తున్నట్టు సమాచారం. అటు కోచింగ్ కేంద్రాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాల కోసమే గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఇబ్బంది లేకుండా, పరీక్షా కేంద్రాలు, ప్రశ్నాపత్రం రూపకల్పన, ముద్రణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది.
ఒకసారి నిర్ణయం తీసుకుంటే చెప్తాం : జనార్ధన్‌రెడ్డి
గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ తేదీపై ఒకసారి నిర్ణయం తీసుకుంటే చెప్తామని టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి నవతెలంగాణకు చెప్పారు. అంటే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అర్థమవుతున్నది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.