Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెవాసులపై పోలీసుల దౌర్జన్యం
- వరంగల్‌లోని జక్కలొద్దిలో 6,600 గుడిసెలకు నిప్పు
- బూడిదైన నిత్యావసర సరుకులు, వస్తువులు
- భయంతో చెట్టుకొకరు పుట్టకొకరైన పేదలు
- పిల్లలు అని చూడకుండా పోలీసుల దాష్టీకం
- లాక్కెళ్లి ట్రక్కుల్లో కుక్కి మడికొండ సైనిక శిక్షణ కేంద్రంలో నిర్బంధం
ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థలం దక్కే వరకు పోరాడుతామని నినదించి.. గూడు కోసం కొట్లాడుతున్న పేదలపై పోలీసులు బుల్డోజర్లను ప్రయోగించారు. వరంగల్‌లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వేలాది మంది నిరుపేదల బతుకులను బుగ్గిపాలు చేశారు. రాత్రి వేళల్లో నిఘా పెట్టి.. రెక్కీ నిర్వహించి.. సీపీఐ(ఎం) నేతలను అరెస్టు చేసి.. నలుదిక్కులా రోడ్లను మూసేసి బుధవారం తెల్లవారుజామునే వందలాది మంది పోలీసులు యుద్ధభూమిని తలపించేలా విధ్వంసం సృష్టించారు. గుడిసెల్లో చొరబడ్డారు. పేదలను భయబ్రాంతులకు గురిచేసి బయటకు లాగేసి.. గుడిసెలకు నిప్పు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి...
నవతెలంగాణ-మట్టెవాడ
సీపీఐ(ఎం) పార్టీ అధ్వర్యంలో పేదలు వరంగల్‌లోని జక్కలొద్దిలో ప్రభుత్వ భూమిలో నెల రోజుల కిందట వేలాది మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఎప్పటికైనా తమకు ప్రభుత్వం గూడుకోసం గింత జాగ ఇస్తుందని ఆశతో ఉన్నారు. కానీ వారి ఆశలపై పోలీసులతో నీళ్లు చల్లించింది. తెల్లవారు జామున నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో నాలుగు దిక్కుల నుంచి 800 మంది పోలీస్ బెటాలియన్ల మిల్ట్రీ వాహనాల్లో గుడిసెవాసులను మూకుమ్మడిగా చుట్టుము ట్టారు. నిద్రిస్తున్న గుడిసెవాసుల గుండెలు అదేరిపడేలా డోజర్ల తెచ్చి పెద్ద పెద్ద శబ్దాలతో చేస్తూ దాడి చేశారు. 4 ఫైర్ ఇంజన్లను మోహరించి యుద్ధభూమిని తలపించేలా గుడిసెలపై విరుచుకుపడ్డారు. ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణీంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పోలీసులకు తోడు అవ్వడంతో మరింత దూకుడు పెంచారు. పెద్ద పెద్ద శబ్దాలకు గుడిసెవాసులు లేచి చూస్తుండగానే ఆడ, మగ, ముసలి, ముత్క తేడా లేకుండా అందరినీ లాక్కెళ్లి భారీ వాహనాల్లో పడేశారు. సామాన్లు, బియ్యం, నిత్యావసర వస్తువులను డోజర్లతో తొక్కించి గుడిసెలకు నిప్పు పెట్టారు. గుడిసెవాసులతో కిక్కిరిసిన వాహనాలను నేరుగా హన్మకొండ జిల్లా రాంపూర్‌లోని సైనిక శిక్షణ కేంద్రానికి తరలించారు.
తగ్గేదేలే అంటున్న గుడిసెవాసులు
నాలుగు రోజులుగా జక్కలొద్ది ప్రాంతంలో అధికారులు రెక్కీ నిర్వహించినట్టు గుడిసెవాసులు తెలిపారు.
రాత్రి సమయాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారని, బుధవారం తెల్ల వారుజామున దాడికి ముందే సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేశారన్నారు. నాలుగు దిక్కులా రోడ్లను మూసి బయట నుంచి ఎవరూ రాకుండా దాడులను ప్రణాళిక ప్రకారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని సైనిక కేంద్రానికి తరలించి మండుటెండల్లో ఉంచి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లకాగితం తీసుకొని అందరితో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. తమ గూడు పోరాటానికి పోలీస్‌లు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థలం దక్కే వరకు తగ్గేదేలే అని స్పష్టం చేశారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా..
నాయకుల అరెస్టు
జక్కలొద్ది గుడిసెవాసులపై పోలీసుల దాడిని ఖండిస్తూ సీపీఐ(ఎం) నాయకులు ఖమ్మం రోడ్డులో ధర్నా నిర్వహించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో మిల్స్ కాలనీ పోలీసులు నాయకులను అరెస్టు చేస్తుండగా పేదలు పెద్దఎత్తున తరలివచ్చి అడ్డుకుంటూ పోలీసు వాహనాలపై ఎక్కి కూర్చున్నారు. పోలీస్ జులుం నశించాలి.. అంటూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.