Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-వరంగల్
ఖిలావరంగల్ మండలం జక్కలొద్దిలో పేదోళ్ల గుడిసెలను పోలీసులు దౌర్జన్యంగా బుల్డోజర్లతో ధ్వంసం చేయడంపై సీపీఐ(ఎం) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట పేదలు వేసుకున్న గుడిసెలను వందలాది మంది పోలీసులు బుధవారం తెల్లవారుజామున చీకట్లోనే వచ్చి తగలబెట్టారు. గుడిసెల్లోకి చొరబడి గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేసి 1100 మందిని అరెస్టు చేసి మడికొండ పోలీస్ ట్రైనింగ్ కేంద్రానికి తరలించారు. గుడిసెలను పెట్రోల్, డీజిల్ పోసి దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నేతలు జక్కలొద్దికి చేరుకుని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలవాసులంతా అసంఘటితరంగ కార్మికులు అని, బీడీలు చుట్టడం, భవన నిర్మాణ కూలి పనులు, హోటళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని చెప్పారు. ఇంటి కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడిన వారు జక్కలొద్దిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని తెలిపారు. భర్త కూలికి పోతే భార్య గుడిసె వద్ద ఉండి గుడిసెను కాపాడుకుంటున్నారని చెప్పారు. ఇంటి స్థలం వస్తుందనే ఆశతో పేదలుంటే.. బుధవారం తెల్లవారుజామున చీకట్లో పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలపై డీజిల్, పెట్రోల్ పోసి తగలబెట్టడం దుర్మార్గమన్నారు. పోలీసుల దుశ్చర్యతో పేదలు భయంతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెల్లో ఉన్న వంట సామగ్రి, మంచాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు, కోడి పిల్లలు, ఇతరత్రా సామానులు అగ్గిలో ఆహుతయ్యాయని చెప్పారు. ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయో అధికారులకు తెలుసన్నారు. బడా రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తీసుకోకుండా పేదలు వేసుకున్న గుడిసెలను దహనం చేయడం దారుణమన్నారు. నెలరోజుల నుంచి కరెంటు లేక, నీళ్లు లేక పోయినా ఇబ్బందులు పడుతూ ఇంటి స్థలం వస్తుందని అప్పులు తెచ్చుకుని గుడిసెలు వేసుకున్నారన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రాజీవ్ గృహకల్ప ఇండ్లను నిర్మించి.. ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి తలుపులు కిటికీలు ధ్వంసమయ్యాయన్నారు. పేదల ప్రభుత్వం, బంగారు తెలంగాణ అంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదలపై మానవత్వం లేకుండా ఇలాంటి దాష్టీకానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. అరెస్టు అయిన పేదలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి పేదల ఇండ్ల స్థలాల పట్ల సానుకూలంగా స్పందిందాలని కోరారు.
అధికారులు అండతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం :
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములు
పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములను బడా రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములు అన్నారు. గతంలో సుందరయ్య నగర్, ఏసీ రెడ్డినగర్ వంటి ఎన్నో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేసిన గుడిసెలతోనే ఏర్పడ్డాయన్నారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి దారుణం, దుర్మార్గం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులకు అంటగట్టడానికే ఇలాంటి దారుణమైన చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పేదలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు బాబు, నలిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, ఆరూరి కుమార్, రత్నం, హైమద్, రాణి పాల్గొన్నారు.