Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాగ్రత్త పడకుంటే భారీ నష్టమే
- గ్రేటర్లో వర్షం భయం
- 50శాతం మించని వరద నివారణ పనులు
- 75శాతం నగరం మునిగే అవకాశముందన్న బిట్స్ పిలాని నివేదిక
- అధికారులపై మంత్రి కేటీఆర్ అసహనం
- పనులను వేగవంతం చేయాలని ఆదేశం
- గతంలోనూ కిర్లోస్కర్, వయాంట్స్ నివేదికలు
- 2సెం.మీ వర్షానికి తట్టుకునే వ్యవస్థే.. : బల్దియా అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మళ్లీ వరద ప్రమాదం పొంచే ఉంది! జరుగుతున్న వరద కాలువ పనుల తీరు చూస్తే అవుననేలానే ఉన్నట్టు తెలుస్తోంది. నివేదికలు కూడ అదేవిధంగా చెబుతున్నాయి. వర్షాకాలంలో వరదలతో నగరం మరోసారి మునిగిపోక తప్పదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
2020లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా నగరమంతా అతలాకుతలమైన విషయం తెలిసిందే. అంతకుముందే నగరంలోని నాలాలు, వరద నీటి కాలువల గురించి కిర్లోస్కర్, వయాంట్స్ ఏజెన్సీలు నివేదికలు అందజేశాయి. ఆ నివేదికలను అమలు చేస్తే వరదల నుంచి నగరాన్ని కాపాడటానికి అవకాశముందని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. కానీ నామమాత్రంగానే పనులుచేశారు. ప్రస్తుతం బిట్స్ పిలాని విద్యార్థులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరింత జాగ్రత్త పడాల్సిన అవసరముంది. 2016లో కురిసిన 21.6 సెం.మీ భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో 2 సెం.మీ వర్షానికి మాత్రమే తట్టుకునే వ్యవస్థ ఉందని బల్దియా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
రెండేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నాలాలు, వరదనీటి కాలువను రీమోడలింగ్ చేయడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఎన్డీపీ) తీసుకొచ్చారు. ఇదీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని అధికారులే చెబుతున్నారు. ఇప్పటివరకు 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే గ్రేటర్ ప్రజలను వరదల నుంచి కాపాడటం కష్టమేనని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక సమావేశంలో మంత్రి కేటీఆర్ చేతులెత్తేయడం గమనార్హం. దీంతోపాటు సిటీలో 75శాతం ప్రాంతం వర్షకాలంలో మునిగిపోక తప్పదని హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన సివిల్ ఇంజినీర్లు ఇచ్చిన ప్రాజెక్ట్ నివేదిక స్పష్టం చేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి వర్షా కాలంలో కూడా నగరవాసులకు ఇబ్బందులు తప్పేలా లేదన్నది స్పష్టమవుతోంది.
బిట్స్ పిలాని నివేదిక ఇలా..
గ్రేటర్లో వరదల ప్రభావంపై బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన సివిల్ ఇంజినీర్లు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా గతేడాది ఓ స్టడీ చేశారు. 'అర్బన్ ఫ్లడ్ రిస్క్ అనాలసిస్ ఆఫ్ బిల్డింగ్స్ యూజింగ్ హెచ్ఈసీ-ఆర్ఏఎస్ 2డీ ఇన్ క్లైమేట్ ఛేంజ్ ఫ్రేమ్ వర్క్స్' ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్వహించిన ఈ స్టడీలో సిటీ వరదల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలో వరుసగా 17 రోజుల్లో 44 సెం.మీల వర్షం కురిసినా, 19 రోజుల్లో 62 సెం.మీల వాన పడినా దాదాపు సగం నగరం (334 కిలోమీటర్లు) మునిగిపోతుందని రిపోర్టులో పేర్కొన్నారు. వర్షాలు పడ్డప్పుడు నీరు ఇంకడానికి వీలు లేకపోవడం వల్లే వరదలు వస్తున్నాయని నివేదికలో తెలిపారు. గ్రేటర్ పరిధిలో నీరు ఇంకడానికి వీలు లేకుండా ఉన్న భూమి 1995లో 55 శాతం.. అయితే 2016లో 73 శాతానికి చేరింది. అది 2050 నాటికి 85 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన ఎల్బీనగర్, చార్మినార్, కూకట్పల్లి, అల్వాల్‌లో సమస్య తీవ్రంగా ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు.
50 శాతం పూర్తికాని పనులు
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, డ్రయినేజీల అభివృద్ధికి రూ.858 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా చేపట్టిన పనులు వర్షాకాలంలోగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్ణయించారు. మొదటి దశలో రూ.858 కోట్ల అంచనాతో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధితోపాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో మొత్తం 60 పనులు, జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులకుగాను 50 శాతం కూడా పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు.
అయితే, రెండేండ్లుగా నగరంలోని వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, నాలాలకు సంబంధించిన పనులు పూర్తయితే ఎంత పెద్ద వాన పడినా కన్నీళ్లు ఆగవని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు వెల్లడించారు. కానీ ఎస్ఎన్డీపీ పనులు, అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్ వర్షాకాలం దగ్గర పడుతున్న సమయంలో ఒక్క ఏడాదిలో ఈ సమస్యను తీర్చలేమనీ, నగరంలో మళ్లీ వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పడం నగర వాసులను ఆందోళనకు గురి చేస్తోంది.
చిన్నపాటి వర్షానికే..
వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో భారీ వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15రోజుల కిందట 15 నిమిషాల వానతో షేక్‌పేట్, టోలిచౌకి, ఎల్బీనగర్లోని అయ్యప్ప కాలనీ లాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడ్డారు. మల్లికార్జున నగర్, త్యాగరాయ నగర్ కాలనీ, బండ్లగూడ, మెట్టుగూడ, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌పేట, నాగోల్, హనుమాన్‌నగర్ కాలనీ, మీర్‌పేటలోని మిథులానగర్, సత్యనారాయణనగర్, చాంద్రయాణగుట్ట, ఉప్పల్, ఫలక్‌నుమాలోని అల్ జుబైల్ కాలనీ, సయ్యద్ బాబానగర్, టోలీచౌకి, నదీంకాలనీ, ఇలా వందల కాలనీలు, బస్తీలు వానంటే వణుకుతున్నాయి.