Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రం ఫెర్టిలైజర్ పాలసీ లోపాలతో పొంచివున్న ముప్పు
- ఏప్రిల్, మే నెలవారీ కోటాలో కోత
- బ్లాక్ తప్పదని రైతుల ఆందోళన
- తప్పని నకిలీ విత్తనాల బెడద
వ్యవసాయ సీజన్(వానాకాలం)కు ఆదిలోనే ఎరువుల(యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాషియం) సమస్య వచ్చేలా ఉంది. కేంద్రం ఫెర్టిలైజర్ పాలసీ లోపాల కారణంగా ఈ ఏడాది ఎరువుల కొరత పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి తగినట్టే రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఎరువుల కోటాలో కోతపడింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి 38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని రైతుసంఘాలు చెబుతున్నాయి. వానాకాలం సీజన్‌కు 23.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి. కేంద్రం వివిధ కారణాలు చూపి అవసరమైనంత ఎరువులను రాష్ట్రానికి సకాలంలో పంపడం లేదని అధికారవర్గాల సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నెలవారీ ఎరువుల కోటాలో ఏప్రిల్, మే నెలల్లో కోత పడింది. రావాల్సిన దానికంటే ఎరువు బాగా తగ్గిందని అధికారులు తెలిపారు.. గత సీజన్లో డీ అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) కోసం రైతులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈసారీ అదే పరిస్థితి పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎరువుల ధరలు కూడా విచ్చలవిడిగా పెరిగాయి. ఫలితంగా స్టాక్ నిల్వ చేసుకునేందుకు డీలర్లు ముందుకు రావడం లేదు.వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వానాకాలం సీజన్ ఈ నెలలో ఆరంభమవుతుంది. మహబూబ్‌నగర్, సిద్దిపేటలోనూ అక్కడక్కడా పనులు ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో జులైలో ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో స్టాక్ పెట్టుకునేందుకు కూడా డీలర్లు వెనుకాడుతున్నారు. మరోవైపు కోఆపరేటివ్ సొసైటీలు కూడా గతంలో లాగా ఖాతా పెట్టే పరిస్థితి లేదని మార్క్‌ఫెడ్ సూచించింది. ఇవన్నీ రాబోయే ఎరువుల కొరతకు సంకేతాలుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తొలకరి పలకరిస్తే విత్తనం.. ఎరువుతోనే పని
మృగశిర కార్తె ఆరంభంతో వర్షాకాలం బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలకరి పలకరిస్తే విత్తనాలు, ఎరువులతోనే పని. రాగల 48 గంటల్లో వర్ష సూచనలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది. చినుకు రాలితే సాగు పనులు జోరందుకుంటాయి. ఈ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా యూరియా 10.5 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2.16 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 9.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉంది.
ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలంలో 5,91,700 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 85వేల మెట్రిక్ టన్నుల యూరియా, 34,657 మె||ట డీఏపీ, 24,889 మె||ట ఎంవోపీ, 1.37 లక్షల మె||ట కాంప్లెక్స్ ఎరువులు, ఎన్ఎస్పీ 12,510, ఇలా మొత్తంగా 2.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. సిద్దిపేటలో 1.36 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మే నెల నాటికి రావాల్సిన ఎరువుల్లో భారీగా కోత పడింది.
జిల్లాలో 5,44,726 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. దీనిలో అత్యధికంగా పత్తి 1.75 లక్షల ఎకరాలు, వరి 1.71 లక్షలు, మొక్కజొన్న 60వేలు, ఆయిల్‌పాం 53వేలు, మిరప 22వేలు, ఇతరత్ర పంటలు 55వేల ఎకరాలకు పైగా సాగవుతాయని అంచనా. వీటికి 1,25,330 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అని అంచనా వేయగా, 33,991 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే మే 16వ తేదీ నాటికి అందుబాటులోకి వచ్చాయి.
కొరత లేకుండా చూస్తాం
మే నెల వరకు రావాల్సిన ఎరువుల కన్నా తక్కువ వచ్చిన మాట వాస్తవమే. ఎంవోపీ కొరత ఎక్కువగా ఉంది. సీజన్ ప్రారంభమే కాబట్టి దీన్ని అధిగమించొచ్చు. ఎరువుల అవసరం ఎక్కువగా ఉండే సమయానికి కమిషనర్‌తో మాట్లాడైనా కొరత లేకుండా చూస్తాం.
-ఎం.విజయనిర్మల :ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సబ్సిడీ మిగుల్చుకోవాలనే ఎత్తుగడ
సబ్సిడీ మిగుల్చుకోవాలనే ఎత్తుగడతో కేంద్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు ఎరువును తరలించి వ్యాపారులు బాగుపడేలా కేంద్రం వ్యవహారం ఉంది కానీ రైతులను దృష్టిలో పెట్టుకోవడం లేదు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే పేరుతో ఎరువులు అందుబాటులో లేకుండా చేస్తోంది. రైతును దెబ్బతీసే ఇటువంటి పనికిమాలిన చర్యలకు పోకుండా గత సీజన్లో ఎంత ఎరువులనైతే సరఫరా చేశారో తదనుగుణంగా సఫ్లరు చేయాలి.
- బొంతు రాంబాబు
తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
ధరల పెంపు దృష్ట్యా నిల్వలు తగ్గించాం
ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 30 నుంచి 40 శాతం ధరలు పెరగడంతో ముందస్తు పెట్టుబడి పెట్టి స్టాక్ తెచ్చుకుని నష్టపోలేం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా ముడిసరుకు కొరత దృష్ట్యా ఎరువుల ధరలు గతేడాది కంటే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతకు ముందులా ఒక్కో డీలర్ ముందుగానే రూ.10లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి నిల్వ చేసుకునే పరిస్థితి లేదు.
- పుల్లఖండం నాగేందర్రావు
ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్
ఖమ్మం జిల్లా కార్యదర్శి