Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూకు అంతర్జాతీయ గుర్తింపు
- ఐఐటీ హైదరాబాద్‌కు ఉన్నతస్థానం
- పెరిగిన హెచ్‌సీయూ ప్రతిష్ట
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యూఎస్ గ్లోబల్ ర్యాంకుల్లో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకులు సాధించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతి పెరిగింది. రాష్ట్రంలోని ప్రతిష్టా త్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాల యం (ఓయూ), హైదరాబాద్ కేంద్రీ య విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), ఐఐటీ హైదరాబాద్, అంతర్జాతీయ ఈ ర్యాంకుల జాబితాలో నిలిచాయి. ఓయూకు అంతర్జాతీయ ప్రమాణాల జాబితాలో 1201-1400 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆసియా దేశాల స్థాయిలో 351-400 మధ్య ర్యాంకు లభించింది. ఐఐటీ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి ర్యాంకుల్లో 601-610 మధ్యలో, ఆసియా యూనివర్శిటీల స్థాయిలో 224వ ర్యాంకును పొందింది. హెచ్‌సీయూ అంతర్జాతీయ ర్యాంకుల్లో 751-800 మధ్య నిలిచింది. సింగపూర్‌కు చెందిన క్వాలిటీ సైమన్స్ (క్యూఎస్) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో ప్రమాణాలను పరిశీలించి, ఏటా ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల 2022-23కు సంబంధించిన వర్శిటీల ర్యాంకులను వెల్లడించింది. భారత్‌లో గతేడాది 35 విశ్వవిద్యాలయాలు ప్రపంచస్థాయి ర్యాంకులు పొందాయి. ఈసారి వాటి సంఖ్య 41కి పెరిగింది. బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సంస్థ అంతర్జాతీయ ర్యాంకుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉనిలిచింది. విద్యాపరమైన విశ్వసనీయత, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన బోధన విధానం, అధ్యాపకులు- విద్యార్థుల శాతం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠ్య ప్రణాళిక ఇలా అనేక అంశాలను క్యూఎస్ సంస్థ పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తుంది. వాస్తవానికి ఉస్మానియా యూనివర్శిటీ గతేడాదితో పోలిస్తే (1200) ఈ ఏడాది (1400) ర్యాంకుకు తగ్గింది. ఐఐటీ హైదరాబాద్ 591 నుంచి 610 అంతర్జాతీయ ర్యాంకుకు దిగజారింది. గత రెండేండ్లుగా కోవిడ్ మూలంగా పరిశోధన, విద్యా ప్రమాణాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు.
భవిష్యత్ ఆశాజనకమే: వి వెంకటరమణ, ఉన్నత విద్య మండలి వైస్ చైర్మెన్
ప్రంపచ స్థాయి ర్యాంకుల్లో రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, హెచ్‌సీయూ, ఐఐటీ హైదరాబాద్ నిలవడం గర్వకారణమే. వాస్తవానికి భవిష్యత్‌లో క్యూఎస్ ర్యాంకులు పెరిగే వీలుంది. ఎందుకంటే అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన పాఠ్య ప్రణాళిక వైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యూఎస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ముందుకెళ్లే వీలుంది. త్వరలో ఇలాంటి సంస్థతో సంప్రదింపులు జరపబోతోంది. మారుతున్న విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు వంద విశ్వవిద్యాలయాలు క్యూఎస్ ర్యాంకులు సాధించే అవకాశముంది.