Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయని నలుగురు పోలీస్ అధికారులకు హైకోర్టు నాలుగు వారాలపాటు విధించిన జైలు శిక్షను నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. వారిపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో నాలుగు వారాల జైలు, రెండు వేలు జరిమానా విధిస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ వేశారు. దీన్ని గురువారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారిచింది. సుప్రీంకోర్టు బీహార్-అర్నేష్ కుమార్ల మధ్య జరిగిన కేసులో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం నిందితులకు సీఆర్పీసీలోని సెక్షన్ 41-ఎ ప్రకారం నోటీసు ఇవ్వాలని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమలు చేయలేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నలుగురు పోలీసులకు వర్తించదని వారి తరఫు న్యాయవాది వాదించారు. భార్యభర్తల మధ్య గొడవలో పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడారనీ, ఇందులో భర్త వాదన చట్ట వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయనప్పుడు గైడ్‌లైన్స్ అమలు నిబంధన వర్తించదన్నారు. ఈ వాదనను సింగిల్ జడ్జి వద్ద పిటిషనర్లుగా ఉన్న భర్త, అతని తల్లి తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తాము పారిపోయామని పోలీసులు ప్రకటించారనీ, లుక్ ఔట్ నోటీసు కూడా ఇచ్చారని చెప్పారు. వాదనల తర్వాత సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ బెంచ్ స్టే ఇచ్చింది.
తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఏపీ రిట్ వాపస్
తెలంగాణ విద్యుత్ సంస్థలైన జన్కో, ట్రాన్స్‌కో తమకు బకాయిలు చెల్లించటం లేదని ఏపీ జన్కో, ట్రాన్స్‌కో ఎమ్డీ తాను వేసిన రిట్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన అఫిడవిట్‌ను గురువారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అనుమతించింది. 2014-17 కాలంలో తమకు తెలంగాణ ప్రభుత్వం రూ.6,283.68 కోట్ల మేర విద్యుత్ సరఫరా బకాయిలుగా చెల్లించాలని ఏపీ రిట్ దాఖలు చేేసింది. కేంద్రం వేసిన కమిటీ ఎదుట ఈ వివాదాన్ని సెటిల్ చేసుకుంటామని ఏపీ తెలపగా... ఇందుకు తెలంగాణ అభ్యంతరం చెప్పింది. రిట్లోని అంశాలపై విచారణ చేసి తుది ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఇలాంటి రిట్లు వేయడం ఏపీకి పరిపాటని ఆరోపించింది. వాదనల తర్వాత ఏపీ రిట్ వెనక్కి తీసుకునేందుకు హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.