Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 శాతం వేతనాలు పెంపు: ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు పీఆర్సీని ప్రభుత్వం వర్తింపచేసింది. దీంతో వారి వేతనాలు 30 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. వారికి ప్రస్తుతం ఒక పీరియడ్ (గంట)కు రూ.300 గౌరవ వేతనం చెల్లిస్తున్నామనీ, దాన్ని రూ.390కి పెంచామని వివరించారు. గెస్ట్ లెక్చరర్లు నెలకు గరిష్టంగా 72 గంటలు బోధించాలని తెలిపారు. దీంతో వారికి నెలకు గరిష్టంగా వచ్చే గౌరవ వేతనం రూ.21,600 నుంచి రూ.28,080కు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు రెండు వేల మంది గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. పీఆర్సీ వర్తింపజేయడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, కోశాధికారి బండి కృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్‌కుమార్, ఉపాధ్యక్షులు ఎం బాబురావు హర్షం ప్రకటించారు. ఈ ఉత్తర్వుల విడుదల కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, విద్యాశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లకు పీఆర్సీ ప్రకారం 30 శాతం వేతనం పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల అతిథి అధ్యాపకుల జేఏసీ అధికార ప్రతినిధి దేవేందర్‌యాదవ్ కుంట హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.