Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల కష్టంలో పాలు పంచుకునే ఎరువులు, విత్తనాలు, మందులమ్మే వ్యాపారులు అన్నదాతల అమాకత్వాన్ని ఆసరా చేసుకుని మోసగిస్తున్నారు. అందుకు అధికారుల నామమాత్రపు చర్యలే కారణమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 65 నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నకిలీ విత్తనాలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ విత్త నాలు స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేశారు. అమ్రాబాద్, పదర మండలాల్లోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా కమీషన్‌పై కొందరు దళారులు ఎరువులు, విత్తనాల దందాను కొనసాగిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఎరువులు, ఫెస్టిసైడ్ మందులను నిల్వ చేసుకుంటూ రైతులకు ఖాతా కింద అధిక ధరలకు అంటగడుతున్నారు. ఎలాంటి అమ్మకపు రషీదులూ ఇవ్వకుండానే విక్రయాలు చేస్తున్నారు. వర్షాలు కురిసి సాగు ప్రారంభమైతే విత్తనాల కొరత తెలిసే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకైతే ఎలాంటి కొరతా లేదని నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హత లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్, హన్మకొండ నుంచి పల్లెలకు మధ్యవర్తుల ద్వారా అక్రమంగా విత్తనాలు పంపిస్తున్నారని తెలిసింది. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి.. ఇక్కడ స్టాక్ చేసుకుంటున్నారు. గత నెల మేలో వరంగల్‌లొ ఒక్కరోజే రూ.21.87 లక్షల విలువ చేసే పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదే పరిస్థితి ఆదిలాబాద్‌లోనూ ఉంది. వానాకాలం సీజన్లో వరి, కంది, కూరగాయలు, పత్తి విత్తనాలను అధికంగా రైతులు కొనుగోలు చేస్తారు. దానికి తగ్గట్టు రైతులకు అవసరమయ్యే విత్తనాలను వ్యవసాయాధికారులు అందించాల్సి ఉంది. విత్తనాలు, ఎరువుల సరఫరాలో లోటుపాట్లు లేకుండా, నకిలీలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలని, పోలీసుల సహకారంతో కమిటీలు వేయాలని కోరారు. ఎన్ని కమిటీలు వేసినా నకిలీల బెడద మాత్రం తప్పడం లేదు. ఇందులో కొంతమంది పెద్దల అండదండలు కూడా ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది.