Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ రాసిన లేఖ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందనీ, తెలంగాణ రైతాంగం పట్ల బీజేపీ కారుస్తున్న మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 'యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత నాది...రైతులు వరి వేయాలి' అన్న బండి సంజరు ముఖం చాటేశాడని తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేసిందనీ, సంజరు మాత్రం రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కునేలకు రాయాలని సూచించారు. రైతుబంధుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్న విషయాన్ని సంజరు గుర్తించాలని కోరారు. వరి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.3054, తాజాగా పెంచిన దాని ప్రకారం కేంద్రం క్వింటాలుకు ఇస్తున్న మద్దతుధర రూ.2060 మాత్రమేననీ, మద్దతుధరలపై ఆయనకు అవగాహన లేదని విమర్శించారు. కాబట్టి కనీసం పత్రికలు చదివైనా వివరాలు తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు కాదని తెలిపారు. గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాధన్ కమిటీ సిఫారసుల ప్రకారం 50 శాతం కలిపి పంటలకు మద్దతుధరలు ప్రకటించాలనీ, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్‌ను విమర్శిస్తున్న బండి సంజరు ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేండ్లలో విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిదని గుర్తు చేశారు.
వ్యవస్థపైగానీ, సమాజంలోని సమస్యలపైనగానీ ఏ మాత్రం ఆయనకు అవగాహన లేదని విమర్శించారు. ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను చూసయినా బండి సంజరు సిగ్గుతెచ్చుకుని భాష మార్చుకోవాలని సూచించారు. ఫసల్ బీమా పథకంలో అంత పస ఉంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలుచేయడం లేదో అడిగి తెలుసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీిఆర్కు లేఖ రాసే బదులు రూ 30,000 కోట్లపై చిలుకు కేంద్రం నుంచి తెలంగాణాకు రావాల్సిన బాకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు.