Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సివిల్స్, గ్రూప్- 1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్సీ సంక్షేమ శాఖ పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ యువత తమ రిజర్వేషన్ కోటాకు సంబంధించినవే కాక ఓపెన్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలంటూ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సివిల్స్, గ్రూప్ -1 పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఆయా అంశాలలో నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌ను త్వరితగతిన మంజూరు చేయాలనీ, సంక్షేమ హాస్టళ్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్ రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. జగిత్యాల,పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ''సహజ'' పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మంత్రి వివరించారు. చౌకగా లభించే నాణ్యమైన ఈ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్లకు అందిస్తే బాగుంటుందన్నారు.