Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఆర్టీసీ పరిరక్షణ-కార్మికుల హక్కులు'అనే అంశంపై ఈనెల 14న రాజకీయ పార్టీలతో సదస్సు నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. గురువారం హైదరాబాద్లో జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ కె హన్మంత్ ముదిరాజ్, కన్వీనర్ విఎస్ రావు, కోకన్వీనర్లు సుద్దాల సురేష్, ఇ యాదగిరి, గుడిసెల అబ్రహం, కోశాధికారి డి గోపాల్, సభ్యులు జక్రయ్య, సాములయ్య, పి రవీందర్రెడ్డి, గోలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ రక్షణకు, కార్మికుల హక్కుల సంరక్షణకు ప్రభుత్వానికి, యాజమాన్యానికి పలు పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో డిపోల్లో నిరసన కార్యక్రమాలు, నిరాహారదీక్షలు చేసినా జేఏసీ ఏర్పడిన ఏడాది కాలంలో అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 14న సదస్సును నిర్వహిస్తున్నామనీ, డిపోల నుంచి ఆర్టీసీ కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.