Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ వెంటనే స్కావెంజర్ల పోస్టులను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య డిమాండ్ చేశారు. పాఠశాలల్లో స్కావెంజర్లు లేని కారణంగా ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సి వస్తున్నదని గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి అవమానకరమని తెలిపారు. గడిచిన రెండేండ్ల నుంచి పాఠశాలల పారిశుధ్యం బాధ్యతలను పంచాయతీలు, మున్సిపాల్టీలకు అప్పగించి విద్యాశాఖ అధికారులు చేతులు దులుపేసుకున్నారని విమర్శించారు. కానీ ఎవరూ వాటివైపు కన్నెత్తి చూడటం లేదని పేర్కొన్నారు. మరుగుదొడ్ల పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం అనంతరం ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం కత్తిమీద సాములా మారిందని తెలిపారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి స్కావెంజర్ల పోస్టులను పునరుద్ధరించాలని కోరారు.