Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీ
- మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరిన పోలీసులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై లైంగిక దాడి ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు ఈ విచారణ కొనసాగనుంది. కేసులోంచి తప్పించుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలతోపాటు ఈ ఆరుగురితోపాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూపీ లాగుతున్నారు. ఇన్నోవా వాహనం విషయంలో మరికొందరి పాత్రపై వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశముంది. ఇదిలావుండగా సామూహిక లైంగికదాడి కేసులో మైనర్ల 4 రోజుల కస్టడీకి జువైనల్ కోర్టు అనుమతించింది. దీంతో మైనర్లను శుక్రవారం పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీ అనంతరం మైనర్లను జువైనల్ హోంకు తరలించాలని కోర్టు ఆదేశించింది. జువైనల్స్ తమ అడ్వకేట్‌ను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. మైనర్లను విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్
లైంగిక దాడి కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించి విచారణ జరపాలని కోర్టును పోలీసులు కోరిన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో లైంగికదాడి లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్‌గా పరిగణించకుండా మేజర్లుగానే శిక్షించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.