Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
- అటవీ అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించని వైనం
నవతెలంగాణ-లింగంపేట్
ఎన్నో ఏండ్ల నుంచి గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్న భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు జేసీబీతో గుంతలు తీయించారు. '30 ఏండ్ల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. మాకు వేరే ఆధారం లేదు' అని బాధిత
గిరిజన రైతు వేడుకున్నా.. అధికారులు కనికరించలేదు. బలవంతంగా భూముల్లో గుంతలు తీయించడంతో రైతు అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని నల్లమడుగు పెద్దతండా సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
నల్లమడుగు పెద్దతండాకు చెందిన ధనవత్తు రాములు నాయక్ కంపార్ట్మెంట్ నెంబర్ 711లో 30 సంవత్సరాలుగా 15 గంటల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అదే కంపార్ట్మెంట్ నెంబర్లో మరో 52 మంది రైతులు అటవీ సరిహద్దును ఆనుకుని భూములను సాగు చేసుకుంటున్నారు. గతంలో వీరికి ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చింది. అయితే, గురువారం ఉదయం అటవీశాఖ ఇన్చార్జి సెక్షన్ అధికారి ఫారుక్, బీట్ అధికారి శారద, అటవీశాఖ సిబ్బంది మొదట రాములు నాయక్ సాగుచేస్తున్న పోడు భూములోకి జేసీబీ దింపారు. దీంతో బాధిత రైతులు అక్కడికి చేరుకుని ఇన్చార్జి సెక్షన్ అధికారితో మాట్లాడుతుండగానే.. బీట్ అధికారి శారద మొక్కలు నాటేందుకు జేసీబీతో గుంతలు తీయించారు. ఆందోళనకు గురైన రైతు రాములు నాయక్ అటవీ శాఖ అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. ఆ రైతు నురగలు కక్కుతూ కిందపడిపోయాడు. ఆగ్రహించిన గిరిజనులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో అటవీశాఖ అధికారులు జేసీబీని వెనక్కి తీశారు. రైతు పరిస్థితి విషమంగా మారడంతో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అధికారులే బాధ్యత వహించాలి..
అటవీశాఖ అధికారుల జులుంతోనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మోతీలాల్ నాయక్ తెలిపారు. దీనికి అటవీశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మిగతా రైతుల భూముల్లో సైతం హరితహారం పేరిట మొక్కలు నాటడానికి అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారని విమర్శించారు. గిరిజనుల భూములు వదిలి పెట్టకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.