Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13,14 తేదీల్లో తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు
- తెలంగాణ రైతుసంఘం పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం సాగు సమస్యలు, రైతాంగ ఇబ్బందులపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం ప్రకటించింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13, 14 తేదీల్లో తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ధర్నాలకు సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మీడియాతో మాట్లాడుతూ వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచలేదని విమర్శించారు. రోజుకో చోట నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించిందని గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.25 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు. మిగిలిన రైతులకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులకు కనీస రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి రుణ అర్హత కార్డులను ఇవ్వడం లేదని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ వారికి వర్తించడం లేదన్నారు. కౌలు రేటు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇతర పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని అన్నారు. ఫలితంగా అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 30 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు చట్టాలను అమలు చేస్తూ, వారందరికీ కార్డులివ్వడంతోపాటు ప్రభుత్వ పథకాలన్నింటినీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, నాయకులు రవీందర్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు వానాకాలం సాగు సమస్యలు పరిష్కరించాలి.
- ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
- రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలి.
- కౌలు రేటు తగ్గించాలి. ప్రభుత్వం భూసారాన్ని బట్టి కౌలు రేటును నిర్ణయించాలి.
- 2011 కౌలు చట్టం ప్రకారం కౌలుదారులకు రుణ అర్హత కార్డులివ్వాలి.
- కౌలు రైతులందరికీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలివ్వాలి.
- ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్ట పరిహారాన్ని కౌలు రైతుకు ఇవ్వాలి.
- రైతుబీమా, రైతుబంధు, పంటలబీమా, రుణమాఫీ కౌలు రైతులకు వర్తింపజేయాలి.
- 58 ఏండ్లు నిండిన రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి.