Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి:
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమండ్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ప్రజా రవాణా ఆర్టీసీని రక్షించాలని, పెంచిన చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకొనేందుకు ప్రయాణీకులపై మళ్లీ భారం మోపిందని విమర్శించారు. గురువారం ఆర్అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ.. ఇప్పటికే రెండుసార్లు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపైన భారం మోపిందని, మళ్లీ డీజిల్ సెస్ పేరుతో బస్సు చార్జీలు పెంచటం దారుణమని అన్నారు. ఆర్టీసీ వివిధ రకాల పేరుతో టిక్కెట్ చార్జీలు పెంచుకుంటూ పోతోందని తెలిపారు. 2 నెలల్లోనే టిక్కెట్ ధరలు భారీగా పెంచిందని విమర్శించారు. ఇప్పుడు డీజిల్ రేట్ల పెంపు కారణం చూపుతూ ప్రజలపై భారం మోపిందన్నారు. సేఫ్టీ సెస్ పేరుతో వసూలు చేయటం, బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం చెల్లించే పరిహారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉండనందున ఆ మొత్తాన్ని కూడా జనం నుండే రాబట్టాలని సెఫ్టీ సెస్ తీసుకొచ్చిందని తెలిపారు. భారీగా చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రజా రవాణా వస్తువుగా చూసి ప్రత్యేక ప్యాకేజీ యిచ్చి ఆదుకోకుండా సెస్‌ల పేరుతో ప్రజలపైనే భారం మోపడం సరికాదన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, వై.విక్రం, నాయకులు యర్రా శ్రీనివాసరావు, అఫ్రోజ్ సమీనా, మెరుగు సత్యనారాయణ, దొంగల తిరుపతిరావు, కొండబోయిన నాగేశ్వరరావు, యస్.కె. మీరా, భూక్యా శ్రీను, పగడాల నాగేశ్వరరావు, అంగిరేకుల నర్సయ్య, తిరుమలాచార్యులు, జిల్లా ఉపేందర్, అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉంపేదర్ పాల్గొన్నారు.