Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోనే అత్యుత్తమమైన క్రీడా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఒడిశా రాజధాని కటక్‌లో ఈ నెల 29 నుంచి జులై రెండు వరకు జరగనున్న 30 వ జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు ఎంపికైన విషయాన్ని గుర్తుచేశారు. ఆయా క్రీడాకారులను, కోచ్, క్రీడా పాఠశాల ఓఎస్డీ డా. హరికృష్ణను అభినందించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఫెన్సింగ్ చాంపియన్ షిప్లో మన రాష్ట్రం నుండి 24 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి - పల్లె ప్రగతిలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య లో 0.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.
భరత్వాజ్కు అభినందనలు..
ఇటీవల జర్మనీలోని సూల్ నగరంలో జరిగిని ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో 50 మీటర్ల రేంజ్లో హైదరాబాద్‌కు చెందిన సురభి భరత్వాజ్ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించటంతో వారికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, టీజీఓ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు, మాంగళ్యగ్రూప్ నమశ్శివాయ పాల్గొన్నారు.