Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోడు భూములకు పట్టాలు ఇవ్వండి : ప్రభుత్వానికి సీపీఐ(ఎం) డిమాండ్
- చర్లలో కదంతొక్కిన కోరెగడ్డ నిర్వాసితులు, పోడు సాగుదారులు
నవతెలంగాణ-చర్ల
కోరెగడ్డ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కోరెగడ్డ నిర్వాసితులు, పోడు సాగుదారులు, పేదలు పెద్దఎత్తున కదంతొక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆ పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలని, అర్హులైన ప్రతి దళిత కుటుం బానికి దళితబంధు అమలు చేయాలని, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలు ఇవ్వాలని, మండల కేంద్రంలో రైతు బజార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా చేయాలని, మండలంలో మొండి గోడలు పిల్లర్లతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల్ల పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో 50 పడకలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ప్రారంభించి పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. 2,500 పేద కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయి తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా కరకట్ట నిర్మాణం చేపడితే.. తట్టమట్టి కూడా తీయకుండా అడ్డుకొని తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలపై అధికార పార్టీ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2021 నవంబర్ డిసెంబర్ నెల్లో మండలంలో ఐదు వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పటికీ సమాధానం చెప్పకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. పోడు సాగుదారుల పట్ల ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల వేధింపులను ఆపాలన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి ఆర్థిక భారాలు వేస్తుందని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం మండల అభివఋద్ధి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీని, ప్రజా ఉద్యమాలను ప్రజల బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మచారి, మండల కమిటీ సభ్యులు కారం నరేష్ మచ్చా రామారావు, కోటి ముత్యాలరావు, పి.సమ్మక్క, తాటి నాగమణి శ్యామల వెంకటేశ్వర్లు, బోళ్ళ వినోద్, బందెల చంటి, సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు, కోరెగడ్డ నిర్వాసితుల పోరాట కమిటీ వివిధ గ్రామ కమిటీల నాయకులు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమస్యలను కలెక్టర్కు నివేదిస్తా : తహసీల్దార్ ఈర్ల నాగేశ్వరరావు
మండల పరిధిలోని సమ స్యలు పరిష్కారం చేస్తాం. మిగిలిన సమస్యలు కలెక్టర్కు నివేదిక ఇస్తాం. కల్యాణలక్ష్మి చెక్కులు త్వరలోనే పంపిణీ చేస్తాం. గతేడాది పంటవేసిన పోడు జోలికి ఫారెస్టు వాళ్ళు వెళ్ళవద్దని వీడియో కాన్పిరెన్స్లో కలెక్టర్ స్పష్టంగా చెప్పారు. పూర్తయిన ఇండ్లను పంపిణీ చేస్తాం. ప్రభుత్వస్ధలం గుర్తించి రైతుబజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.