Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
- 6,29,352 మంది దరఖాస్తు
- 2,683 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వంసిద్ధం చేసింది. ఐదేండ్ల తర్వాత రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉండదు. గంట ముందునుంచే అభ్యర్థులకు కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలు జరగనున్నాయి. టెట్ పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది కలిపి మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్-1కు 1,480, పేపర్-2కు 1,203 కలిపి మొత్తం 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ నిర్వహణ కోసం 1,480 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 14,80 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13,415 మంది హాల్ సూపరింటెండెంట్లు, 29,513 మంది ఇన్విజిలేటర్లు, 252 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లు, రూట్ అధికారులను నియమించామని వివరించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీని కోరామని పేర్కొన్నారు. ఓఎంఆర్ పత్రంలో గడులను నింపడానికి నల్ల ఇంకు బాల్‌పాయింట్ పెన్నునే వినియోగించాలని సూచిం చారు. ఇతర రంగుల పెన్నులతో గడులను నింపితే ఆ ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఓఎంఆర్ పత్రాన్ని మడత పెట్టడం, ముడతలు పడేలా చేయడం, బార్కోడ్ నలిగిపోవడం వంటివి చేయొద్దని కోరారు. హాల్‌టికెట్లపై అభ్యర్థుల ఫొటో, సంతకం లేకపోతే పాస్‌పోర్టు సైజు ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఆధార్ లేదంటే ఇతర గుర్తింపు కార్డుతో సంబంధిత జిల్లా డీఈవోలను సంప్రదించాలని తెలిపారు. వాటిని పరిశీలించి డీఈవో తగు నిర్ణయం తీసు కుంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 12 గంటల్లోపు, సాయంత్రం ఐదు గంటల్లోపు పరీక్షా కేంద్రాల నుంచి బయ టికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.