Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక లారీల అడ్డగింత
నవతెలంగాణ-బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్ మంజీర పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా లారీల ద్వారా ఇసుక తరలింపు నిలిపివేయాలని కూరగాయల రైతులు డిమాండ్ చేస్తున్నారు. అహర్నిశలు కష్టపడి సాగు చేస్తున్న కూరగాయ పంటలు దుమ్ము ధూళితో పాడవుతున్నాయని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోడ్డుపై అడ్డంగా రాళ్ళు పెట్టి ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 రోజులుగా అడ్డూ అదుపు లేకుండా రాత్రి, పగలు లారీలలో ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. లారీల దుమ్ము, ధూళి పేరుకు పోయి చేతికి వచ్చిన కూరగాయ పంటలు పాడవుతున్నాయని, దాంతో తమ జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో అక్కడకు చేరుకున్న క్వారీ నిర్వాహకులు మహిళా రైతులను పక్కకు తోసేసి ఇసుక లారీలను పంపించి వేశారు. తమను ఆదుకోవాల్సిన రాజకీయ నాయకులు, అధికారులు అండగా నిలవకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మహిళా రైతులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.