Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ కోసం...
- సంఘటిత సమరశీల పోరాటాలు
- ఐఎఫ్టీయూ రౌండ్‌టేబుల్‌లో ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించేదాకా సంఘటిత సమరశీల పోరాటాలు నిర్వహించాలని రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోగలమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమతో పెట్టుబడిదారులు పెరుగుతున్నారనీ, కానీ పెట్టుబడిదారులపై కార్మికులు ఆధారపడినట్టు పరిస్థితులు సృష్టిస్తున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌పై రౌంట్‌టేబుల్ సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత కార్మికులు విడిపోయి ఉన్నారని చెప్పారు. కార్మిక సంఘాలు కూడా చేయాల్సిన పని చేయకపోవడంతో అవి దెబ్బతినడంతోపాటు కార్మికులకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో లక్షల మంది కార్మికులను సమీకరించే పరిస్థితి మారిందన్నారు. బానిస బతుకులు పోవాలనే లక్ష్యంతో రక్తతర్పణం చేసి 8 గంటల పని సాధించుకున్నామనీ, ప్రస్తుతం 12 గంటల పని విధానం అమలుల్లోకి వచ్చిందన్నారు. మోడీ ప్రధాన మంత్రి అయ్యాక 12 మంది కార్పొరేటర్లు ఏం అడిగితే అది ఇస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగా కార్మిక చట్టాలను, హక్కులను తొలగించాలనే కార్పొరేట్ల ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును సైతం బీజేపీ కాలరాస్తున్నదన్నారు. అన్ని రంగాలను ప్రయివేటీకరించేందుకు సిద్ధమైందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్...అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు.రెండు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులంటే, విద్యుత్ శాఖలో 24వేల మందిని మాత్రమే క్రమబద్ధీకరించి సీఎం చేతులుదులుపుకున్నారని చెప్పారు. ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి కె సూర్యం తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో యాదానాయక్ (సీఐ టీయూ),యూసుఫ్ (ఏఐటీయూసీ) మాట్లాడారు. న్యాయ వాది కేవీఎస్ రామచంద్రరావు కార్మిక హక్కులు, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను వివరించారు. వివిధ శాఖ నుంచి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు హాజరయ్యారు.