Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తాం
- కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం : పట్నం రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీపై ప్రజా ఉద్యమం నిర్మించాలని పట్నం రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పట్నం ఆధ్వర్యంలో 'ప్రయివేటు విద్యాసంస్థల్లో భారీగా ఫీజుల పెంపు- ప్రభుత్వపాత్ర'అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అందెసత్యం మాట్లాడుతూ విద్యారంగాన్ని సామాజిక ఉత్పత్తి కేంద్రంగా భావించి ప్రపంచం ముందుకుపోతున్నదని చెప్పారు. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను సరుకుగా మార్చి ఆదాయ వనరులను పెంచు కునేందుకు ఉపయోగిం చుకుంటున్నాయని విమర్శించారు. ఏ దేశంలో విద్యారంగ వ్యాపారం ఎంత అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. భారత్‌లో నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక అందుకనుగుణంగానే విద్యావిధానం రూపొందుతున్నదని అన్నారు. ఆ రంగం బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకునీ, ప్రయివేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో విద్యారంగ కేటాయింపులు 11.1 శాతం నుంచి 10.1 శాతానికి తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తున్నారని వివరించారు. అధ్యక్షత వహించిన పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహరావు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల ఫీజుల దోపిడీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తిరుపతిరావు కమిటీ సిఫారసులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు దోపిడీని అరికట్టాలంటూ తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈనెల 25 వరకు అన్ని జిల్లాల్లోనూ రౌండ్‌టేబుల్ సమావేశాలను నిర్వహించాలని చెప్పారు. ఈనెలాఖరులోగా రాష్ట్రసదస్సు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు వి నాగేశ్వరరావు మాట్లాడుతూ అధిక ఫీజులతో తల్లిదండ్రులే బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉన్న రాష్ట్రాలు, దేశాలే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఫీజులను అరికట్టేందుకు బలమైన ఉద్యమాలు నిర్మించాలన్నారు. ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె పార్థసారథి మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థలు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నా ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. సమగ్ర సమాచారంతో ఫీజు దోపిడీని అరికట్టాలంటూ కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ కరోనా వచ్చినా బడ్జెట్ స్కూళ్లు నష్టపోయాయి తప్ప కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎలాంటి నష్టం రాలేదన్నారు. ఆన్లైన్ తరగతుల పేరుతో పూర్తి ఫీజులను వసూలు చేశాయని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఎలా నిర్ణయిస్తుందో, అదే మాదిరిగా ప్రయివేటు బడుల ఫీజులనూ నిర్ణయించడానికి ఒక కమిటీ ఉండాలని చెప్పారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు చట్టాలున్నాయని అన్నారు. రాష్ట్రంలోనూ ఉత్తర్వులున్నా వాటిని అమలు చేయొద్దంటూ ప్రయివేటు విద్యాసంస్థలు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లిదండ్రుల సంఘం నాయకులు ఆర్ మల్లేష్, కృష్ణమోహన్, పట్నం హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు మారన్న, శ్రీనివాస్, ఆవాజ్ నాయకులు పాషా, అబ్దుల్ సత్తార్, పట్నం రాష్ట్ర నాయకులు డీఏఎస్‌వీ ప్రసాద్, రిటైర్డ్ టీచర్ మహేందర్‌రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ విజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.