Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ ఘటనపై నోరు మెదపరేం...?
- పెద్దోళ్ల పిల్లలకు ఒక న్యాయం..?
- కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, రేణుకా చౌదరి, ఉత్తమ్ పద్మావతి ఆగ్రహం
- గవర్నర్కు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా..? అని కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగి రెండు వారాలు కావస్తున్నా... ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, విచారణ సమగ్రంగా జరిగేలా చూడాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో వారు గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎంఐఎం, టీఆర్ఎస్కు చెందిన బడా నేతల పిల్లలు ఈ కేసులో ఉన్నందు వల్లే దాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పెద్దోళ్ల పిల్లలకు ఒక న్యాయం..? పేద పిల్లలకు మరో న్యాయమా..? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. రేణుకా చౌదరి మా ట్లాడుతూ... లైంగిక దాడికి పాల్పడిన వారిపై ఫోక్సో చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ స్పందించాలని డిమాండ్ చేశారు. పద్మావతి మాట్లాడుతూ...అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఈ ఘటనపై స్పందించకపోతే మహిళలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.