Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ వెబినార్‌లో లక్ష్మయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజా మద్దతుతో ఐక్య ఉద్యమాల ద్వారానే ఆర్టీసీల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్టీసీల పరిస్థితి ఒకే రకంగా ఉన్నదనీ, ప్రభుత్వాలు ప్రజారవాణాను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటును ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీలను లాభనష్టాలతో చూడరాదనీ, నష్టాలకు కార్మికులు ఎంతమాత్రం కారణం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానపర నిర్ణయాల వల్లే నష్టాలు వస్తున్నాయనీ, అలాంటి విధానాలను కార్మికులు ఎప్పటికప్పుడు ఐక్య ఉద్యమాల ద్వారా తిప్పికొట్టగలిగితేనే మనుగడ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో మొట్టమొదటి ప్రజారవాణా బస్సును ప్రారంభించి 90 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో 'ప్రజారవాణా- ఆర్టీసీలు ఎదుర్కొంటున్న సవాళ్లు' అంశంపై శుక్రవారం ఆన్లైన్ వెబినార్ నిర్వహించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య ప్రధాన వక్తగా మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడే ప్రపంచబ్యాంక్ ఆదేశాలతో ఆర్టీసీల విభజనకు ప్రయత్నం జరిగిందనీ, ఆ ప్రమాదాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ ముందే పసిగట్టి ఐక్య పోరాటాల ద్వారా సంస్థను పరిరక్షించుకోగలిగిందని తెలిపారు. దాదాపు 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అవే ప్రపంచబ్యాంకు ఆదేశాల అమలు ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీల ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. జర్ననీలో ప్రజారవాణా చార్జీలను 90 శాతం తగ్గించారనీ, నెదర్లాండ్స్‌లో ఉచిత ప్రజారవాణాను ప్రవేశపెట్టారని ఉదహరించారు. ఢిల్లీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారనీ, తమిళనాడులో కూడా ఇదే విధానాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉచిత ప్రజా రవాణా వైపు ఆయా దేశాలు వెళ్తుంటే, తెలంగాణ ఆర్టీసీల్లో చార్జీల పెంపు చేపట్టారని అన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఆక్కుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోతుందనీ, క్రమేణా ప్రజలకు సంస్థ దూరవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారవాణా విధ్వంసానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఇవేననీ, వీటి ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజామద్దతుతోనే ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమ నిర్మాణం జరగాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాలు ఆర్టీసీకి అని నిధులు ఇచ్చాం...ఇన్ని ఇచ్చాం అని ప్రచారం చేసుకుంటున్నాయనీ, అది ప్రభుత్వాల కనీస బాధ్యత అని విశ్లేషించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపకులు ఎమ్ఎన్ రెడ్డి మాట్లాడుతూ 90 ఏండ్ల ఆర్టీసీ ప్రస్తానాన్ని వివరించారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో కార్మికులు అనేక నిర్బంధాల మధ్య పనిచేస్తున్నారనీ, పాలకులు తమ నియంతృత్వ విధానాలను విడనాడాలని హితవు చెప్పారు. 2015లో 8 రోజుల సమ్మె తర్వాత ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందనీ, అదే తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటి వరకు ఇచ్చిన చివరి వేతన సవరణ అని చెప్పారు. రాష్ట్రంలో ప్రయివేటు బస్సులు, టీఎస్ఆర్టీసీలో అద్దెబస్సులు పెరిగాయన్నారు. అద్దె బస్సులకు పన్నులతో పాటు పెరిగిన డీజిల్ ధరల వ్యత్యాసాన్ని కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి లెక్కకట్టి ఆర్టీసీ యాజమాన్యం వారికి చెల్లిస్తున్నదనీ. దీనివల్ల ఆర్టీసీకి ఏం లాభంమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు రూ.1,500 కోట్లు ఇవ్వాలనీ, బడ్జెట్లో 2 శాతం నిధులు కేటాయించి, ప్రయివేటుకు ఇస్తున్న రాయితీలన్నింటినీ ఆర్టీసీలకూ వర్తింపచేయాలని కోరారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్సులు తెలంగాణలో తిరుగుతున్నాయనీ, ఇవన్నీ టూరిస్టు సర్వీసులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని, స్టేజి క్యారేజీలుగా తిప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాల ఫలితమని విశ్లేషించారు. ప్రజావసరాలు ఉన్నచోట్ల బస్సులు తిప్పట్లేదనీ, ఆర్టీసీ విస్తరణ చేపట్టట్లేదని చెప్పారు. డీజిల్‌కు ప్రత్యామ్నాయం విద్యుత్ బస్సులు అంటున్నారనీ, కానీ భవిష్యత్‌లో అవి ఆర్టీసీలకు తెల్ల ఏనుగులుగా మారతాయని వివరించారు. ఆర్టీసీ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కన్వీనర్ పి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రజారవాణాగానే చూడాలనీ, వ్యాపార దృక్పధంతో చూడరాదని అన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీరాంజనేయులు వందన సమర్పణ చేశారు.