Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తన ఉద్యమ చరిత్ర ఆధారంగా తెరకెక్కించాలని కేసీఆర్ నిర్ణయం
- తద్వారా జాతీయ రాజకీయాల్లో చర్చ లేవదీద్దాం
- ఇప్పటికే జై బోలో భారత్, దేశ్ కే లియే పేర్లు రిజిస్టర్
- నానా పటేకర్‌తో సంప్రదింపులు...?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను బాగా ప్రచారంలో పెట్టటం ద్వారా రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నించిన బీజేపీకి... టిట్ ఫర్ ట్యాట్ అనే విధంగా గట్టి షాక్నివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సినిమా రంగం ద్వారా, ముఖ్యంగా హిందీ సినిమాల ద్వారా దాన్ని ఢీ కొనాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవితం, ఉద్యమ చరిత్ర ఆధారంగా అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ ఏకంగా ఒక సినిమానే నిర్మించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే 'దేశ్ కే లియే' , 'జై బోలో భారత్...' అనే రెండు సినిమా టైటిళ్లను టీఆర్ఎస్ తరపున ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. సంబంధిత కథ, కథనాలపై సీఎం కేసీఆర్ సినీ పెద్దలతో సీరియస్‌గా చర్చిస్తున్నట్టు వినికిడి. తనపై తీయబోయే సినిమా కోసం ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్‌ను కేసీఆర్ ఇప్పటికే సంప్రదించినట్టు తెలిసింది.
బీజేపీ తన రాజకీయ వ్యూహంలో భాగంగా హిందీలో ప్రముఖ నటులైన కంగన రనౌత్, అక్షరు కుమార్, అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తదితరులను వినియోగించుకుంది. వీరిలో కంగనతో ఝూన్సీ లక్ష్మిబాయి సినిమాను తీశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది. అందులో అనుపమ్ ఖేర్ ముఖ్య భూమికను పోషించారు. ఆయన భార్య కిరణ్ ఖేర్ బీజేపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిని వినియోగించుకోవటం, వారి ద్వారా సినిమాలను తీయించటం ద్వారా బీజేపీ అతివాద జాతీయ భావాలను విపరీతంగా ప్రచారంలో పెట్టగలిగిందని సీఎం కేసీఆర్... శుక్రవారం రాత్రి ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. తద్వారా ఆ పార్టీ సాంస్కృతిక రంగంలో తన భావజాలాన్ని వేగంగా వ్యాప్తి చేయిస్తోందని అభిప్రాయపడ్డారు. అందువల్ల తాము కూడా సినిమా రంగాన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో హిందీలో కూడా సినిమాలు తీయాలనీ, తద్వారా బీజేపీని ఎదుర్కోవాలంటూ ఆయన నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ జీవితం ఆధారంగా ఇప్పటికే ఒక నిర్మాత తెలుగులో శ్రీకాంత్ హీరోగా ఒక సినిమాను ప్రారంభించారు. ఆ సినిమా పూర్తి కావాల్సి ఉంది.
కేసీఆర్‌కు మమత లేఖ...
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... శనివారం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈనెల 15న ఢిల్లీలో నిర్వహించబోయే సమావేశానికి హాజరు కావాలనేది ఆ లేఖ సారాంశం. 'బలమైన ప్రజాస్వామ్య స్వభావం కలిగిన దేశానికి బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం. ఈ దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై నేడు మనల్ని పట్టి పీడిస్తున్న విభజన శక్తిని ప్రతిఘటించాలి...' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలు తిరిగి సమావేశమై భారత రాజకీయ భవిష్యత్తు గమనంపై చర్చించాలని కోరారు. ఇందుకోసం ఈనెల 15న నిర్వహించబోయే సమావేశానికి హాజరు కావాలంటూ ఆమె కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, పినరయి విజయన్, భగవంత్‌సింగ్ మాన్, స్టాలిన్ తదితరులకు లేఖలు రాశారు. అయితే దీనికి కొద్ది రోజుల ముందుగానే దీదీ... సీఎంకు ఫోన్ చేసి మాట్లాడినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే కేసీఆర్ హడావుడిగా ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్‌కు చేరుకుని... నేతలతో అత్యవసరంగా సమావేశమైనట్టు సమాచారం. ఆ తర్వాతే భారత రాష్ట్ర సమితి పేరిట పార్టీ ఏర్పాటు, సినిమాలు తదితరాంశాలు చర్చకొస్తుండటం గమనార్హం.