Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సలహా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి పెరిగి పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని ఉప రాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు అన్నారు. దీనికోసం ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు రైతుల పక్షాన నిలవాలని ఆకాంక్షించారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన 'ప్రకతిసైన్యం' పుస్తకాన్ని హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివద్ధి కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. మట్టిసారాన్ని మనుగడకు ఆధారమైన ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అనీ, సేంద్రీయ పద్ధతిలో ఖర్చు తగ్గి, ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సేంద్రీయ పంటలకు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. పశుసంపద ద్వారానే ప్రకతి వ్యవసాయం సానుకూలమవుతుందన్నారు. సాంకేతికతను అవసరానికి తగినంతే వినియోగించుకోవాలని చెప్పారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన 100 మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమంటూ ప్రచురణకర్త యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత డి. ప్రసాద్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నార్మ్ సంచాలకులు శ్రీనివాస రావు, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు డా. ఎస్.రామచందర్ తదితరులు పాల్గొన్నారు.