Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయపార్టీల నేతలకు జేఏసీ ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఆర్టీసీ స్థితిగతులపై చర్చించేందుకు ఈనెల 14న జరిగే రాష్ట్ర సదస్సుకు హాజరవ్వాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ రాజకీయపార్టీల నేతలను ఆహ్వానిం చింది. ఈ మేరకు శనివారం జేఏసీ వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, గుడిసెల అబ్రహం, ఎంఏ మాజీద్, సాములయ్య తదితరులు రాజకీయపార్టీల నేతలకు ఆహ్వానాలు అందించారు. టీపీసీసీ అధ్యక్షులు ఏ రేవంత్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీజేపీ, తెలంగాణ జన సమితి, ఏఐఎమ్ఐఎమ్, సీపీఐ(ఎమ్ఎల్), ఆమ్ఆద్మీ, ఇంటిపార్టీ, టీవైఎస్ఆర్సీపీ పార్టీల నేతల్ని కలిసి ఆహ్వానపత్రాలు అందచేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు 'ఆర్టీసీ రక్షణ-కార్మిక హక్కుల సంరక్షణ' అంశంపై జరిగే రాష్ట్ర సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను తెలపాలని జేఏసీ నేతలు రాజకీయపార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలపై నిర్భంధం, వెల్ఫేర్ కమిటీల ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న రెండు పేస్కేల్స్, కార్మికులకు రావల్సిన బకాయిలు, రిటైర్డ్ కార్మికుల సెటిల్మెంటు డబ్బులు, రాష్ట్ర బడ్జెట్లో 2 శాతం నిధుల కేటాయింపు డిమాండ్ తదితర అంశాలతో కూడిన విషయపత్రాలను జేఏసీ ప్రతినిధులు రాజకీయపార్టీల నేతలకు అందచేశారు.