Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం నాయకుల నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రప్రభుత్వం ప్రకటించిన నామమాత్రపు మద్దతు ధరలను నిరసిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆందోళన నిర్వహించింది. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని పంటల ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేసింది.ఈమేరకు శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆ సంఘం నాయకులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు మాట్లాడుతూ వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు పెరిగిన ఉత్పత్తి ఖర్చుకు తగినట్టుగా లేవని చెప్పారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు పెంచకుండా కేంద్రం నామమాత్రంగా పెంచిందని విమర్శించారు. వ్యవసాయ ఉపకరణాల ఖర్చులు బాగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు పంటలు తప్ప మిగితా అన్ని పంటలకు పెంచిన మద్దతు ధరలు...పెరిగిన ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా ఉందని చెప్పారు. సమగ్ర ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించకపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వరికి క్వింటాలుకు రూ.3050 రూపాయల ఉత్పత్తి ఖర్చు అవుతుందనీ, దానికి 50శాతం కలిపితే రూ.4,575 అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా మద్దతు ధర నిర్ణయించిందని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, పీఎన్ఎం నాయకులు యాదగిరి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.