Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పార్టీ పేరుతో కొత్తనాటకం : ఎంపీ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆయా కులాల వాళ్లు తమ చేతివృత్తులను ఆపి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఏం జరిగింది? వారి ఆకాంక్షలు ఒక్కటీ నెరవేరలేదు. కుల సంఘాలకు భవనాలు కట్టిస్తే అవి బువ్వ పెడ్తయా? బీసీ సంక్షేమాన్ని రాష్ట్ర సర్కారు పూర్తిగా విస్మరించింది. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా టీఆర్ఎస్ పార్టీ తొక్కిపెట్టింది. రాష్ట్రంలో 54 శాతం మంది బీసీలుంటే ఆ సామాజిక తరగతులకు చెందిన ముగ్గురికే మంత్రి పదవులిస్తారా? ఒక్కశాతం జనాభా ఉన్న కేసీఆర్ సామాజిక తరగతికి నాలుగు మంత్రి పదవులా? ఇదెక్కడ న్యాయం. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ జాతీయపార్టీ పల్లవి ఎత్తుకుని కొత్త నాటకం ఆడుతున్నారు' అని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ అధ్యక్షతన బీసీ సదస్సును నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా లక్ష్మణ్‌ను పలవురు శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి కోసం ఎనిమిదేండ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోడీ ఎంతో చేశారని తెలిపారు. అదే సమయంలో మన రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం బీసీలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్లను కేటాయించి రూ.10 కోట్లను ఖర్చుపెట్టలేదని వివరించారు. యూపీ, బీహార్, తదితర రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు బీసీలకు రాజకీ యంగా పెద్ద పీట వేశాయనీ, ఎంపీ, ఎమ్మెల్యే పదవులి వ్వడంతోపాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారని తెలి పారు. రాష్ట్రంలో ఎంబీసీల కోసం ప్రత్యేకబడ్జెట్ పెట్టాలనీ, చేతివృత్తిదారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్ల మాదిరిగా మారుస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను కేసీఆర్ నొక్కేస్తున్నారని విమర్శించారు.