Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత ఇల్లు కూలి ఇద్దరు కూలీలు మృతి
- ఇద్దరికి తీవ్రగాయాలు, ఎంజీఎంకు తరలింపు
- ఓనర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందారని బంధువుల ధర్నా
- తల్లి మరణించడంతో అనాధలైన ముగ్గురు పిల్లలు
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ పాత భవనాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇంతేజార్గంజ్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ చార్బౌలిలోని వాటర్ ట్యాంక్‌కి వెళ్లే ప్రధాన దారిలో ఉన్న మోజమిల్ పాత ఇల్లు గోడలను కూల్చే పనిలో పది మంది కూలీలు శనివారం ఉదయం పనిలోకి వచ్చారు. మట్టి ఇటుకతో నిర్మించిన పురాతన భవనం గోడలను తవ్వి ఇనుప చువ్వలతో సిమెంటు నింపే పని చేస్తున్నారు. గోడలను కింద నుండి తవ్వాలని యజమాని చెప్పగా, అలా చేస్తే ప్రమాదం అని మేస్త్రీ చెప్పినా ఇంటి ఓనర్ వినలేదు. దాంతో కూలీలు గోడను కింది నుంచి తవ్వే ప్రయత్నం చేయగా.. పాత గోడ కావడంతో ఒక్కసారిగా గోడ కూలి అక్కడ పనిచేస్తున్న నలుగురు కూలీలపైన పడింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన భవన శిథిలాల కింద ఉన్న క్షతగాత్రులను బయటికి తీసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులు.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్‌కి చెందిన బోసు సునీత (30), దేశాయిపేటకు చెందిన సదిరం సాగర్ (26)గా గుర్తించారు. మరో ఇద్దరు జ్యోతి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. యజమాని నిర్లక్ష్యం కారణంగా కూలీలు మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తూ తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కూలిపోయిన ఇంటి ఎదుట బైటాయించారు.
తల్లి మరణంతో అనాధలైన ముగ్గురు పిల్లలు.
సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన బోసు సునీత భర్త లక్ష్మణ్ పది నెలల కింద అనారోగ్యంతో చనిపోవడంతో తన ముగ్గురు పిల్లల బాధ్యత తనపైన పడింది. దాంతో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్న ఆమె.. కూడా మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథ లయ్యారు. ఈ సంఘటన చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయి కంటతడి పెట్టుకున్నారు.