Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాణాత్మక పనులు చేస్తున్న టీఆర్ఎస్
- కేసీఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు
- 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది...?
- విద్వేషాలు లేవుకాబట్టే చైనా అభివృద్ధి
- కేంద్రానికి చాలా ఎక్కువ ఇస్తున్నాం.. : ఖమ్మం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అభివృద్ధిని వదిలేసిన కాంగ్రెస్, బీజేపీ.. విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఒకరిది కులపిచ్చైతే మరొకరిది మత పిచ్చని వ్యాఖ్యానించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. మరో చాన్స్ ఇవ్వమని రాహుల్‌గాంధీ అడగడాన్ని తప్పుబట్టారు. విద్వేషాలు లేవు కాబట్టే చైనా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతి కాలంలోనే కరెంట్, నీటి కష్టాలు తీరాయని తెలిపారు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు పోతే వార్త అని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం ఖమ్మం వచ్చిన కేటీఆర్.. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఒక్కరోజే ఖమ్మంలో రూ.100 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఖమ్మం నగరపాలక సంస్థ ముందంజలో ఉందని తెలిపారు. నిర్మాణాత్మక పనుల గురించి టీఆర్ఎస్ యోచిస్తుంటే బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతూ ఖమ్మంలో ఓ యువకున్ని బలిగొనడమే కాకుండా ఆ నెపాన్ని మంత్రి అజరుపైకి నెట్టాలని చూశారన్నారు. తెలంగాణలోనే ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలు ఇటువంటి కుట్రపూరిత చర్యలను అర్థం చేసుకుంటారని చెప్పారు. 1987 నాటికి భారత్, చైనా 430 బిలియన్ డాలర్లతో అభివృద్ధిలో సమానంగా ఉంటే.. నేడు చైనా 16 ట్రిలియన్ డాలర్లతో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. 'మసీదులు కూల్చి శవం వెళ్తే మీకని, శివం వెళ్తే మాకని' బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కులం, మతం పేరిట పంచాయితీలు పెట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. పల్లె, పట్టణ ప్రగతి, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి తదితర పథకాల గురించి ఏ సీఎం ఆలోచించాడని అడిగారు. దార్శనికతను దాచుకోకుండా పరమతాలనూ ఆదరించేవాడే నాయకుడని చెప్పారు. ఏనిమిదేండ్లలో తెలంగాణ నుంచి రూ.3,65,797 కోట్లు తీసుకున్న కేంద్రం, రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. మోడీని గట్టిగా ఎదుర్కొనేది ఒక్క కేసీఆరేనని స్పష్టంచేశారు.
సభా ప్రారంభంలో 'ఖమ్మం ప్రగతి నివేదిక'ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 'ఖమ్మం అభివృద్ధి గుమ్మం' అని సభాధ్యక్షులు, మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. కేసీఆర్ సమర్థ పాలనతోనే ఇంతటి ఎండకాలంలోనూ చెరువులు, కాల్వలు నిండుగా ఉన్నాయన్నారు. జీవో 58 ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఖమ్మంలో ఇటీవల జరిగిన అభివృద్ధితో ఆస్తుల విలువ మూడు, నాలుగు రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్‌గా నిల్పిన మేయర్ పునుకొల్లు నీరజను ఈ సదంర్భంగా మంత్రి అభినందించారు. స్వార్థం లేకుండా పనిచేయడం, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి తొమ్మిది స్థానాలు నెగ్గడమే లక్ష్యమన్నారు. భూకబ్జాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని మంత్రి కేటీఆర్ చెప్పినట్టు ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. ఎనిమిదేండ్లలో రూ.50వేల కోట్ల అభివృద్ధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుందన్నారు. జడ్పీ చైర్మెన్ లింగాల కమలరాజ్ వందన సమర్పణ చేశారు. సభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పాలేరు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషయ్య, డీసీఎంఎస్ చెర్మెన్ రాయల శేషగిరిరావు, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ లక్ష్మీప్రసన్న, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచంద్, సుడా చైర్మెన్ విజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.