Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్:
- ఐఎస్బీలో 'సైబర్ సెక్యూరిటీ-సైబర్ నేషనల్ సెక్యూరిటీ' జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో డీజీపీ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సైబర్ నేరాల కట్టడికి త్వరలోనే 'సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'ను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగు తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యాన ఈ సెంటర్ ఏర్పాటు తప్పని సరి అని ఆయన అన్నారు. ఐఐటీ, ఐటీతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల శాఖల సమన్వయంతో ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి లోని 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)' లో 'సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేషనల్ సెక్యూరిటీ' అనే అంశంపై శనివారం జరిగిన ఒక రోజు జాతీయ సదస్సులో ముగింపు సమావేశానికి హాజరై డీజీపీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు సైతం పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య అవగాహన పోస్టర్లను డీజీపీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల ను అరికట్టడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందల మంది పోలీసు అధికారులకు సైబర్ నేరాలపై శిక్షణనిచ్చి నియమించా మన్నారు. అలాగే జిల్లాలు, కమిషనరేట్లతో పాటు రాష్ట్రస్థాయిలో సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలు దేశ భద్రతను ప్రమాదంలో పడే స్థాయికి చేరనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి గాను పోలీసు వ్యవస్థను సంపూర్ణంగా పటిష్ట పరుస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 'టీ4సీ' ని ప్రారంభించామని తెలిపారు. మరో పదేండ్లలో చోటు చేసుకునే సైబర్ నేరాలను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌లెన్స్ చురుగ్గా పని చేస్తుందన్నారు. ఇటీవల మహేష్ కో ఆపరేటీవ్ బ్యాంకు నుంచి రూ. 20 కోట్లను సైబర్ నేరగాళ్లు దారి మళ్లించడాన్ని ఆయన ఉదహరిం చారు. ఉదయం ప్రారంభమైన ఈ జాతీయ సదస్సులో రాష్ట్ర హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, కేంద్ర హౌంశాఖ ఐటీ కార్యదర్శి బసు తదితరులు పాల్గొన్నారు.