Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఈయూ మహిళా కన్వెన్షన్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజన్ మహిళా సబ్‌కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనను సదస్సు తీవ్రంగా ఖండించింది. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయు) హైదరాబాద్ డివిజన్ మహిళా సబ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి అరవింద్‌నగర్ లోని సుగుణాకర్‌రావు భవన్లో వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్‌ను అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత మిశ్రా ప్రారంభించారు. సమాజంలో మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా రక్షణ లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, కుల, మతాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరు మహిళల రక్షణకై ప్రభుత్వాన్ని నిలదీయాలనీ, వివక్షను రూపుమాపే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగే లైగింకవేధింపుల కేసుల్లో వేగంగా న్యాయ విచారణ జరిపి, కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి టి.వి.ఎన్.ఎస్.రవీంద్రనాథ్, తెలంగాణ రాష్ట్ర మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ పి.సుజాత, కోశాధికారి ఆర్.శ్రీనివాసన్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.అధీష్ రెడ్డి, జి.తిరుపతయ్య హాజరయ్యారు. ఎం.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, హైదరాబాద్ డివిజన్ మహిళా సబ్ కమిటీ కన్వీనర్ వి.మైథిలి మహిళా కన్వెన్షన్ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.