Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 నుంచి 25 వరకు సీఎం కేసీఆర్‌కు లేఖలు
- 27,28 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు
- జులై 1న జిల్లా కేంద్రాలు, 9న హైదరాబాద్‌లో మహాధర్నా :టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 25 వరకు ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఈ మెయిల్, ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాస్తామని చెప్పారు. 27,28 తేదీల్లో మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఎస్టీఎఫ్ఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా నూతన విద్యావిధానం (ఎన్ఈపీ 2020) రద్దు, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్ల సాధన కోసం దశలవారీ పోరాటంలో రాష్ట్రంలోని సమస్యలను జోడించి వచ్చేనెల ఒకటిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామన్నారు. అదేనెల 9న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని వివరించారు. జులై 17న ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గురుకుల, కేజీబీవీ ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలనీ, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు.
అధ్యక్షత వహించిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీ పోస్టులను పదోన్నతులు, నియామకాల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష నియామకాలు జరిగేలోపు విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ కోసం సర్వీస్ పర్సన్లను నియమించాలని చెప్పారు. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు వెంటనే సరఫరా చేయాలన్నారు. మన ఊరు-మన బడి పనులను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాలల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగంలో సమూల మార్పులు చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, మన ఊరు-మనబడి మన బస్తీ-మన బడి పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు గణనీయంగా చేరే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 21 వేలకుపైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి తోడు, అదనంగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడానికి ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టాలన్నారు. ఇప్పటికే పర్యవేక్షక పోస్టులైన డీఈఓకు సంబంధించి 12 జిల్లాల్లోనే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 జిల్లాల్లో ఎఫ్ఏసీలు పనిచేస్తున్నారని వివరించారు. 21 డీఈవో పోస్టులను మంజూరు చేయాలన్నారు. 64 డిప్యూటిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. 594 మండలాలకుగాను కేవలం 16 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పని చేస్తున్నారని వివరించారు. మిగతా మండలాల్లో ఎఫ్ఏసీలుగా ప్రధానోపాధ్యాయులే బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కొన్ని జిల్లాల్లో ఒక్కరే రెండు నుంచి 12 మండలాలకు ఎంఈఓగా బాధ్యతలు నిర్వహించడం రాష్ట్రంలో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనతకు అద్దం పడుతుందన్నారు.