Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒంటరి జీవితంపై విరక్తి చెందినట్టు సూసైడ్ లెటర్
- వాచ్మెన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న ఆమె ఇంట్లోని స్నానాల గదిలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సూసైడ్‌నోట్, ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను కూడా గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. తాను కోరుకున్నట్టు తన జీవితం లేదని, ఒంటరి జీవితంతో విరక్తి చెందానని, తల్లిదండ్రులకు ఇక భారం కాదల్చుకోలేదని అందులో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని ప్రత్యూష సూసైడ్ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఆమె మృతదేహాన్నిఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని, లోతుగా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.
ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా
ప్రత్యూష ప్రముఖ సినీనటులు, హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు. జాక్వెలిన్, పరిణితీ చోప్రా, మాధురి దీక్షిత్, కాజోల్ దేవగన్, విద్యా బాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శ్రుతి హాసన్, క్రీడాకారిణి సానియా మీర్జా, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, కృతి కర్బందాతో పాటు చాలా మందికి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు. అమెకు బంజారాహిల్స్‌లో బోటిక్ ఉన్నట్టు తెలుస్తోంది.
వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రత్యూష ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశానని ప్రత్యూష ఇంటి వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృత్తిపరంగా మంచి పొజిషన్లో ఉన్న ఆమెకు ఆర్థికపరమైన ఇబ్బందులా.. ఇంకేమైన కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండుమూడు రోజులుగా ప్రత్యూష ఉండే ఇంటికి ఎవరెవరు వచ్చారో ఆరా తీస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.