Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా పాఠశాలలకు చేరుకోని పుస్తకాలు
- యూనిఫామ్స్ జాడేలేదు
- నత్తనడకన 'మన ఊరు-మనబడి'
- పదోన్నతులు, బదిలీల్లేక పంతుళ్ల అసంతృప్తి
- ఉపాధ్యాయుల కొరతతో బోధనపై ప్రభావం
- విద్యావాలంటీర్ల నియామకంపై స్పష్టత కరువు
- రేపటినుంచే బడులు పున:ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం పరిస్థితి అంతా ఆగమాగంగా ఉన్నది. కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. అందుకనుగుణంగా పాఠశాలలను, మౌలిక వసతులను కల్పించాలి. ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాలి. కానీ విద్యాశాఖ సమస్యలను గాలికొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సోమవారం నుంచి బడుల పున:ప్రారంభమవుతున్నా ఇంతవరకూ పాఠ్యపుస్తకాలు స్కూళ్లకు చేరుకోలేదు. 26 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. వారి కోసం 2.10 కోట్ల పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. వాటిలో ఇప్పటి వరకు 40 లక్షల పుస్తకాలను మాత్రమే ముద్రించి జిల్లా కేంద్రాలకు పంపించారు. ఇంకా 1.70 కోట్ల పుస్తకాలను ముద్రించాల్సి ఉన్నది. దీన్ని బట్టి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. బడులు ప్రారంభమైన రోజే పిల్లలకు ఉచితంగా రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలి. గతేడాది సైతం విద్యార్థులకు వాటిని ఇవ్వలేదు. అంటే వారికి నాలుగు జతల బట్టలివ్వాలి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి 26 లక్షల మంది విద్యార్థులకు కోటిన్నర మీటర్ల వరకు బట్ట అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం టెస్కోతో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. కానీ అవసరమైన బట్ట ఇంకా రాలేదు. దీంతో యూనిఫారాలు అందజేయడం ఆలస్యం కానుంది. ఇలా పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది.
21 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో సుమారు 21 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరతతో బోధనపై తీవ్ర ప్రభావం పడనుంది. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు నష్టపోయే ప్రమాదముంది. 2019-20 విద్యా సంవత్స రంలో 15,661 మంది విద్యావాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పనిచేశారు. కరోనా నేపథ్యంలో గత రెండు విద్యాసంవత్సరాలుగా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ లు జరిగాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు విద్యా వాలంటీర్లను నియమించకపోవడం, మరోవైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఆ మీడియాన్ని ఎవరు బోధిస్తా రన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఆదివారం టెట్ రాతపరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నది. ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి కనీసం ఆర్నెల్ల సమయం పడుతుంది. అప్పటి వరకు విద్యార్థులు నష్టపోవాల్సిందేనా?అని ఉపాధ్యా య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇంకోవైపు వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపడతా మంటూ ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. తూతూమంత్రంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. పండితులు, పీఈటీ అప్గ్రెడేషన్ ప్రక్రియ అలాగే ఉన్నది. 5,571 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇలా అనేక సమస్యలతో టీచర్లు సతమతమవుతున్నారు. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారానికే 'మన ఊరు-మనబడి' పరిమితం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలొస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా నామమాత్రంగా పాఠశాల ల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తున్న ది. టెండర్లు పూర్తయినా చాలా బడుల్లో పనులే ప్రారంభం కాలేదని సమాచారం. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి నాలుగు పాఠశాలల్లోనే మన ఊరు-మనబడి పనులు పూర్తి చేసినట్టు తెలిసింది. మార్చి ఎనిమిదో తేదీన వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి మూడేండ్లలో రూ.7,289.54 కోట్లను ప్రభు త్వం ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యా ర్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పాఠశాలల కు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం సరిపోయినన్ని నిధులు కేటాయించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయిం చిన నిధులతోనే సర్దుకుపోయి వసతులు కల్పించాలని పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)లకు చెప్తున్నట్టు సమాచారం. దీంతో ఆ కార్యక్రమం లక్ష్యం నెరవేరబోదన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతున్నది. ఇంకోవైపు ఈనెల మూడు నుంచి ప్రారంభమైన జయ శంకర్ బడిబాట కార్యక్రమం సమస్యలతోనే సాగుతున్నట్టు తెలుస్తున్నది. పారిశుధ్య కార్మికు లు లేకపోవడంతో ఉపాధ్యాయులే పాఠశాలల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేసుకోవా ల్సి వస్తున్నది. పంచాయతీ, మున్సిపాల్ కార్మి కుల సేవలను వినియోగించుకోవాలని ప్రభు త్వం ఆదేశించినా ఆచరణలో అది అమలు కావ డం లేదు. పారిశుధ్య కార్మికులను నియమిం చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.