Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటకెక్కిన వాటర్ బాటిళ్ల ఉత్పత్తి
- మార్కెటింగ్‌కు భారీగా డిమాండ్
- ప్లాంట్ల పేరుతో కోట్లు వృధా...
- కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్ళకు తలొగ్గిన ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నీళ్ల బాటిల్ కొనుక్కొని తాగడం ఇప్పుడు అందరికీ అలవాటైంది. బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ సహా అన్నింటా నీళ్ల బాటిళ్లకు డిమాండ్ ఉంది. గృహ అవసరాలకూ 20 లీటర్ల వాటర్ బాటిల్ బబుల్స్‌ను సప్లరు చేస్తున్నారు. వాటికీ డిమాండ్ భారీగా ఉంది. గతంలో మాదిరి ఇప్పుడు రోడ్ల పక్కన పబ్లిక్ నల్లాలు లేవు. సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు వాటిని తొలగించేశాయి. దాహం అయితే వాటర్ ప్యాకెట్ కొనుక్కొని గొంతు తడుపుకోవల్సిందే. ప్రభుత్వాల 'మాయ'లో పడి ప్రజలు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నీళ్లు కొనుక్కొని తాగేలా అలవాటు పడ్డారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ వందల కోట్ల నీటి వ్యాపారం చేస్తున్నది. కిన్లే, ఆక్వాఫినా, హిమాలయ, బిస్లరీ వంటికి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి కాకుండా అనేక లోకల్ బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. విచిత్రంగా ఈ కంపెనీలన్నింటికీ నీటిని సరఫరా చేసేది ప్రభుత్వమే. అసలు ప్రభుత్వమే వాటర్‌బాటిళ్లను తయారుచేసి మార్కెట్ చేస్తే...ఇప్పుడున్న లీటర్ వాటర్ బాటిల్ ధర సగానికి తగ్గుతుంది. అలా చేస్తే కార్పొరేట్ కంపెనీలకు లాభాలొచ్చేదెలా? అందుకే వాటర్ బాటిళ్ల ఉత్పత్తివైపు కన్నెత్తి చూడొద్దంటూ కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలను శాసించేదాకా వెళ్లాయంటే ఆశ్చర్యం లేదు. కాకపోతే ప్రభుత్వ పెద్దలు అడపాదడపా సర్కారు వాటర్ బాటిళ్లు వస్తున్నారు అంటూ ప్రకటనలు చేస్తుండటం, ఆ తర్వాత కార్పొరేట్ లాబీయింగ్‌తో ఆ ప్రకటన మరుగున పడిపోవడం అలవాటుగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వాటర్‌బోర్డు ద్వారా 20 లీటర్ల వాటర్ క్యాన్లు (బబుల్స్), ఒక లీటర్, రెండు లీటర్ల బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కూడా తయారు చేస్తామంటూ అప్పటి పాలకులు ప్రకటనలు చేశారు. దానికోసం వాటర్బెడ్స్ వద్ద కోట్లు ఖర్చు చేసి, ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కానీ బాటిళ్లు మార్కెట్లోకి రాకుండానే ఆ ప్లాంట్లు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 'మిషన్ భగీరథ' పేరుతో వాటర్‌బాటిళ్లు తయారు చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. దీనికి నమూనాగా కొన్ని బాటిళ్లు కూడా తయారు చేయించారు. ఆ తర్వాత ఏమైందో... మళ్ళీ ఆ బాటిళ్లు కనిపించలేదు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ ఆయిల్స్ ఆధ్వర్యంలో వాటర్‌బాటిళ్ల యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 'కిన్నెర' పేరుతో కొన్ని బాటిళ్లను స్థానిక మార్కెట్లోకి విడుదల చేశారు. కార్పొరేట్ సంస్థల రంగప్రవేశంతో 'కిన్నెర' కనుమరుగైంది. అడపాదడపా సర్కారు వారి నీళ్లబాటిళ్లు వస్తున్నాయంటూ ప్రకటనలతో హడావిడి చేయడం, ఆ తర్వాత 'ఏం మాయ' జరుగుతుందో కానీ ఆ ఊసే లేకుండా పోవడం పరిపాటిగా మారింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గతంలో కార్పొరేట్ నీళ్ల వ్యాపార కంపెనీలకు జలమండలి నీటి సరఫరాపై అనేక ఆందోళనలు జరిగాయి. మన నీళ్లను శుద్ధి చేసి, మనకే అధిక ధరలకు విక్రయించడాన్ని ఆపార్టీ అప్పట్లోనే వ్యతిరేకించింది. నీళ్లను శుద్ధిచేసి ప్రభుత్వమే ప్రజలకు అందించాలని డిమాండ్ చేసింది. బహిరంగ మార్కెట్లో బ్రాండుతో సంబంధం లేకుండా లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఉంది. రైల్వే స్టేషన్లలో అదే లీటర్ బాటిల్‌ను రూ.15కే విక్రయిస్తున్నారు. సినిమా థియేటర్లలో 750 ఎమ్ఎల్ వాటర్ బాటిల్‌పై రూ.25 ఎమ్మార్పీ ముద్రించి అవే కంపెనీలు అమ్మేస్తున్నాయి. ఇక పెద్ద పెద్ద మాల్స్‌లో అయితే అవే కంపెనీలు లీటర్ నీళ్ల బాటిల్‌పై ఎమ్మార్పీ ధర రూ.60 నుంచి రూ.80 వరకు ముద్రించి అమ్మేస్తున్నాయి. గతంలో 250 ఎమ్ఎల్ వాటర్ ప్యాకెట్ ధర ఒక్క రూపాయి ఉండేది. ఇప్పుడది కంపెనీలను బట్టి, క్వాంటిటీని తగ్గించి రూ.3 నుంచి రూ.5 వరకు పెంచి అమ్మేస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న సిటీల్లో నీళ్లు దొరక్క మూగ జీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. నీటి వ్యాపారానికి అలవాటు పడిన ప్రభుత్వం వాటికి నీటి వసతి కల్పించడాన్ని మర్చిపోయింది. సర్కారు వాటర్ బాటిళ్ల ఉత్పత్తి కోసం ప్రభుత్వం వెచ్చించిన సొమ్ము నీళ్లపాలై, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది.