Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న ఢిల్లీలో మమత మీటింగ్‌పై టీఆర్ఎస్ నిర్ణయం
- కాంగ్రెస్ రాకుంటే కేటీఆర్‌ను పంపుదాం
- ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
- ఆయనతో పీకే, ఉండవల్లి సుదీర్ఘ భేటీ
- తాజా రాజకీయాలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్‌పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికను పంచుకొనేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈనెల15న ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సీఎంలతో నిర్వహించబోయే సమావేశానికి హాజరుపై టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా మమతా బెనర్జీ ఫోన్ చేసి ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించడంతో సీఎం కేసీఆర్ తాను నేరుగా అక్కడకు వెళ్లకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశానికి హాజరైతే, డుమ్మా కొట్టాలనీ, ఆపార్టీ రాకుంటే మంత్రి కే తారకరామారావును పంపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. మమతా బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశంపై సీఎం కేసీఆర్ పలువురు నేతలతో సంప్రదింపులు, సమాలోచనలు జరుపుతున్నారు. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో కేసీఆర్...వాటికి సంబంధించిన వ్యూహాలను రచించేందుకు వీలుగా పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు కీలక రాజకీయ నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. దానిలో భాగంగా ఆదివారంనాడాయన ప్రగతిభవన్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే), కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తోనూ సమావేశమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌కు వచ్చిన ప్రశాంత్ కిశోర్... సాయంత్రం ఐదు గంటల వరకూ కేసీఆర్‌తో సమాలోచనలు జరిపారు. ఇంతకు ముందు ఆయన ఆధ్వర్యంలో టీఆర్ఎస్పై నిర్వహించిన సర్వేలు, గెలుపోటములు, ప్రజల ఆలోచనలు, తాజాపరిణామాలు, పరిస్థితులపై వారిరువు రూ అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకవైపు బీజేపీ తన రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించ కుండా వేచి చూస్తుండటం, మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీ, ఇంకొవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... కేసీఆర్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీఎంలకు లేఖలు రాయటం తదితరాంశాలు వారి భేటీలో చర్చకొచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..? తదుపరి పరిణామాలు ఎలా ఉత్పన్నమవుతాయనే విషయమై కేసీఆర్... ప్రశాంత్ కిశోర్‌తో సమాలోచనలు చేసినట్టు వినికిడి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ తరపున, వ్యక్తిగతంగానూ ఆయన సర్వేలు చేశారు. ఈ క్రమంలో ఉండవల్లి...సీఎంతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయవాది కూడా కావడంతో సీఎం పలు అంశాలపై ఆయనతో చర్చించి, సలహాలు అడిగినట్టు కూడా తెలుస్తున్నది. వీరిరువురూ దాదాపు రెండు గంటలకు పైగా భేటీ అయ్యి, రాజకీయ చర్చలు జరిపారు. మరోవైపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని...ఈనెల19న కాకుండా అంతకం టే ముందే నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలకు తెరదించుతూ, తానే మరో రెండేండ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతోనూ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ కేవలం మర్యాద పూర్వకంగా జరిగిందనీ, ఎలాంటి రాజకీయ ప్రాథాన్యత లేదనిముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పాయి.