Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం..
- టీఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీగా పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు
- ఆర్టీసీ చార్జీల పెంపును ఖండిస్తున్నాం :
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - వైరా టౌన్
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకూ నెరవేర్చ లేదని, రాబోయే ఎన్నికల్లో వామపక్షాలన్నింటినీ ఐక్యం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తమది టీఆర్ఎస్పై పోరాడే పార్టీని అని, ఆ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీగా పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదన్నారు. తెలంగాణలో బీజీపీ నేతలు రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపుతున్నారన్నారు. మతాల పట్ల బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. ఆర్టీసీ చార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నామమాత్రంగా పెంపుదల చేసి కేంద్ర ప్రభుత్వం రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్, రవాణా ఖర్చులు 20 నుంచి 30 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వంద రూపాయలలోపు పెంచడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉధృతమైన ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వైరా నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులకు తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, సుంకర సుధాకర్, మెరుగు సత్యనారాయణ, పిట్టల రవి, మండల కార్యదర్శులు తోట నాగేశ్వరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కే నరేంద్ర, దొంతిబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.