Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ ఛార్జీల వ్యవస్థను రద్దు చేయాలి
- హెచ్ఆర్డీఏ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్తగా నియమించనున్న ప్రభుత్వ డాక్టర్లకు ప్రయివేటు ప్రాక్టీసుకు అనుమతించాలని పలువురు డాక్టర్ల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇన్ఛార్జీల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహేశ్ అధ్యక్షతన ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిశితంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోవడంతోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రయివేటు ప్రాక్టీసు నిషేధంపై ప్రభుత్వం అందరితో సంప్రదిస్తే సమస్య ఉత్పన్నమయ్యేది కాదని డాక్టర్ మహేశ్ తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఈ నిర్ణయంతో డాక్టర్లకు నష్టం లేదనీ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దూరమవుతాయని చెప్పారు. 'ఏపీ కేటాయించిన డాక్టర్లను రిలీవ్ చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దాన్ని అమలు చేయకుండా డీఎంఇ ముగ్గురు డాక్టర్లను కొనసాగిస్తున్నారు. ఇదంతా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ హరీశ్ రావుకు తెలుసా? తెలియదా? మంత్రి సమాధానమివ్వాలి' అని మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్ డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వాస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు లేవని తెలిపారు. డీఎంఈ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రి జోక్యం చేసుకుని డాక్టర్లకు, ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లేని ఆంక్షలు ప్రభుత్వ డాక్టర్లకు మాత్రమే ఎందుకు విధిస్తున్నారని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ ప్రతిభాలక్ష్మి ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యం, వైద్యవిద్య దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పునరాలోచించాలని కోరారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తనకొచ్చే జీతంతోనే బతుకున్నారా? ప్రయివేటు ప్రాక్టీసు లేదా? అని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పురుషోత్తం ప్రశ్నించారు. సంఘాలన్ని సంఘటితం గా పోరాడితే విజయం సాధించవచ్చని తెలిపారు. సరైన వసతి, సౌకర్యాలు లేని చోట 24 గంటలు అందుబాటులో ఉండటం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకురాలు డాక్టర్ వన్యా జాస్మిన్ ప్రశ్నించారు.
మంత్రికి తప్పుడు సలహాలిస్తున్న డీఎంఈ... డాక్టర్ రాజీవ్
మంత్రి హరీశ్ రావుకు డీఎంఈ తప్పుడు సలహాలిస్తున్నారని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రాజీవ్ ఆరోపించా రు. ఈ సమావేశంలో తెలంగాణ టీచింగ్ గవర్నమెం ట్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతి,హెచ్ఆర్ డీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్,నాయకు రాలు డాక్టర్ భారతి మాధవరం, తెలంగాణ జూడా నాయకులు డాక్టర్ విష్ణు, డాక్టర్ శ్రీకాంత్,డాక్టర్ విజ యేందర్,ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్, డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.