Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతోన్మాద నియంత్రణలో మీడియా విఫలం
- 95 శాతం చానల్స్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే...
- వాటిలో మెజారిటీ మోడీకి అనుకూలమే..
- రాఘవాచారి 'నివాళి' పుస్తకావిష్కరణలో సురవరం సుధాకరరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో ఫాసిజం పెరుగుతున్నదనీ, దీన్ని నియంత్రించడంలో మీడియా విఫలం అవుతున్న దని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. మతపర అంశాలపై హిందూ మతాచారులతో వాగ్వివాదాలు పెట్టించి, ఆవేశకావేశాలను మీడియా రెచ్చగొడుతున్నదని చెప్పారు. దేశంలోని 95 శాతం ఛానల్స్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయనీ, అందులో అత్యంత ఎక్కువ చానల్స్ ఫాసిజానికి, మోడీకి అనుకూలంగా వ్యవహారిస్తూ, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నా యని ఆక్షేపించారు. విశాలాంధ్ర పూర్వ సంపాద కులు సీసీ రాఘవాచారి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాఘవాచారి సంపాదకీయాల రెండవ సంపుటి ''నివాళి'' పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరా బాద్ మగ్ధూంభవన్లో జరిగింది. ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా ఫాసిజాన్ని ప్రేరేపిస్తూ విద్వేష ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా శాస్త్రీయ, హేతుబద్ద ఆలోచనా ధోరణికి వ్యతిరేకమని చెప్పారు. జర్నలిజంలో ఎమర్జెన్సీ కాలంలో పరిస్థితుల కంటే ప్రస్తుతం వంద రెట్లు ఎక్కువగా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయనీ, జర్నలిస్టులపై కేసులు పెట్టడం, హత్యలు చేయడం కూడా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులది కీలక పాత్ర అనీ, కానీ ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ యాజమాన్యాల చేతుల్లోకి పోయిందని విశ్లేషించారు. స్వంత పత్రిక పెట్టుకుని స్వేచ్చగా వాస్తవాలను వెల్లడించే గౌరీ లంకేష్ వంటి జర్నలిస్టులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కేవలం కొన్ని పత్రికలు మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తున్నా యని అభిప్రాయపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ రాఘవాచారి సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వారనికొనియాడారు. గతంలో వత్తి రీత్యా జర్నలిస్టులు ఛానల్స్ మారేవారని, ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నా రనీ, ఎవరు ఎప్పుడు ఏ పార్టీల్లో ఉంటారో తెలియడం లేదన్నారు. రాజకీయ వ్యవస్థ మారిందనీ, నైతిక విలువలు పడిపోయా యని, ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుందన్నారు. రాఘవాచారి నిబద్ధత కలిగిన గొప్ప జర్నలిస్టు అని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాఘవచారి సంపాదకీ యాల్లో ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ, ప్రజా సమస్యల గొంతుకను వినిపించేవారని అన్నారు. ఆయన సంపాదకీయాలు నేటి తరానికి ఉపయోగ మన్నారు. నిబద్ధత, నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తిత్వం అని అన్నారు. రాఘవాచారి జీవితమంతా 'విశాలాంధ్ర'కు అంకితం చేశారని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ రాఘవాచారితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన భావ జాలం తనపై పూర్తిస్థాయిలో ఉన్నదని చెప్పారు. సంపాదకీయం అనేది ఒక కళ అని, రాఘవాచారి సులువైన భాషలో సంపాదకీయాలు రాసేవారని గుర్తు చేశారు. ప్రజాపక్షం సంపాదకులు కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గొప్ప వ్యక్తిత్వం రాఘవాచారి సొంతమని అన్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ పలు అంశాలు ప్రస్తావించారు. కార్యక్రమానికి ఆర్.వి.రామారావు అధ్యక్షత వహించారు.