Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద..
- ట్రయల్ రన్‌ను అడ్డుకున్న భూ నిర్వాసితులు
నవతెలంగాణ-అక్కన్నపేట
నష్టపరిహారం ఇచ్చే వరకూ ట్రయల్‌రన్ నిర్వహించొద్దని గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్ భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద ఆదివారం వందలాది మంది భూనిర్వాసితులు ధర్నా చేశారు. పరిహారం అందించే వరకు ట్రయల్‌రన్ నిర్వహించొద్దని నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ రన్ చేయడానికి ఒప్పుకోమని తెగేసి ప్రాజెక్టు వద్ద బైటాయించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా ప్రాజెక్టు ట్రయల్ రన్ చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, ఇవ్వాల్సిన పూర్తి పరిహారం ఇవ్వకుండా ట్రయల్ రన్ చేస్తామని నిర్వాసితులను బెదిరింపులకు గురిచేయడం ప్రభుత్వ అసమర్థతేనన్నారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, తమకు పరిహారం ఇస్తే తామే దగ్గరుండి పనులను సాఫీగా సాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి ఇంకా ఇండ్లకు ఇవ్వాల్సిన డబ్బులు, స్పెషల్ ప్యాకేజ్, కొన్ని భూములకు సంబంధించిన పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా భయపడేది లేదని, తమ ప్రాణాలు పోయినా పరిహారం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్ల్లను త్యాగం చేస్తే తమను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన పరిహారం పూర్తిగా చెల్లించి పనులు మొదలు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు నల్ల మహేందర్ రెడ్డి, కంప వినోద్, నిఖిల్ రెడ్డి, వినయ్, తిరుపతి రెడ్డి, శంకర్ రెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.