Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైరుతి వచ్చే..రైతు మురిసె
- ఖమ్మంలో భారీ వర్షం
- 7.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వానలు
- హైదరాబాద్‌లో చిరుజల్లులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నైరుతి' ఆగమనంతో తొలుకరి పలుకరించింది. వాతావరణం చల్లబడింది. చినుకు పడింది. మట్టివాసన పరిమళించింది. ఏరువాక సంబురం ఆరంభమైంది. నాటేందుకు విత్తనం సిద్ధమైంది. ఎండవేడిమి నుంచి నగరవాసులకు చిరుజల్లు ఉపశమనం కలిగించింది. గతేడాది కంటే కాస్త ఆలస్యమైనా నైరుతిరుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో సోమవారం భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం రాత్రి వరకూ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7.38 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 94 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి మేఘావృతమై ఉంది. నైరుతి రుతు పవనాల ఆగమనంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గాయి. ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
రాష్ట్రంలో మహ బూబ్‌నగర్ జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయనీ, వచ్చే మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంమీదుగా కిందిస్థాయిలో పశ్చిమ దిశ నుంచి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తొలకరి పలుకరింపుతో రైతులు విత్తనాలు విత్తేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అన్నదాతలు దుక్కిదున్ని, అచ్చులు తోలుకుని వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం టౌన్ - 7.38 సెంటీమీటర్లు
బాచ్పలి - 5.58 సెంటీమీటర్లు
(మేడ్చల్ మల్కాజిగిరి)
నాగులవంచ(ఖమ్మం) -4.35 సెంటీమీటర్లు
పాముకుంట - 3.7 సెంటీమీటర్లు
(యాదాద్రి భువనగిరి)
నారూర్(ఆదిలాబాద్) - 3.6 సెంటీమీటర్లు