Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి విద్యుత్ సరఫరా కట్ చేసి లాఠీచార్జీ
- మహిళలనూ ఇండ్ల్లల్లో నుంచి ఈడ్చుకుంటూ కొట్టిన పోలీసులు
- యువకుల తలలకు తీవ్ర గాయాలు
- భయానక వాతావరణాన్ని సృష్టించిన పోలీసులు
- అక్రమంగా పోలీసుస్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-అక్కన్నపేట
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన భూ నిర్వాసితులపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశారు. గ్రామంలోని విద్యుత్ సరఫరా కట్ చేసి మరీ వందలాది మంది పోలీసులు భూనిర్వాసితుల ఇండ్లపై దాడి చేశారు. వారిని తీవ్రంగా కొడుతూ వందమందికిపైగా నిర్వాసితులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా దొంగల్లా పోలీసుల చేత దాడి చేయించి తీవ్రంగా కొట్టారిన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టును అడ్డుకోవడం లేదని, మా డిమాండ్లు నెరవేరిస్తే తామే ముందుండి ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. మహిళలని కూడా చూడకుండా వారిని ఎక్కడపడితే అక్కడ కొట్టి పోలీసులు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు భూములిచ్చి చివరికి తాము లాఠీ దెబ్బలు తినే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. తమ ప్రాణాలు పోయినా డిమాండ్లు నెరవేర్చే వరకు ఖాళీ చేయమని తెగేసి చెప్పారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు నిర్వాసితులకు తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. తాము టెర్రరిస్టులం కాదని, తమ న్యాయమైన పరిహారాన్ని అడుగుతుంటే... దొంగదారిన పోలీసులు వచ్చి తమను కొట్టి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
దాడిని ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. నిర్వాసితులకు న్యాయం చేయాల్సిందిపోయి వారిపై తిరుగుబాటు చేయడం సిగ్గుచేటన్నారు. భూనిర్వాసితులకు సీపీఐ అండగా ఉంటుందన్నారు.
నిర్వాసితులకు బీఎస్పీ అండ: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూనిర్వాసితులపై అర్ధరాత్రి లాఠీఛార్జి చేసి వందలాది మంది రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ వారికి అండగా ఉంటుందన్నారు.
నిర్వాసితులపై దాడి హేయమైన చర్య: కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి
అర్ధరాత్రి భూనిర్వాసితులపై వందలాది మంది పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం హేయమైన చర్య అని, దీనికి పూర్తి బాధ్యత హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ వహించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. కాంగ్రెస్ నిర్వాసితులకు అండగా ఉంటుందన్నారు.