Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూమిలో గుడిసెలను తొలగించడం అన్యాయం
- పేద మహిళలపై పోలీసుల దౌర్జన్యం దారుణం
- భూములను పేదలకు పంచాల్సిందే : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-మెదక్ డెస్క్ :పేదలు వేసుకున్న గుడిసెలను కాల్చివేయడం అన్యాయమని, జక్కలొద్దిలో భూములను పేదలకు పంచి తీరాల్సిందేనని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా జక్కలొద్దిలోని ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని చేస్తున్న భూ పోరాటానికి మద్దతుగా సోమవారం ఆమె సందర్శించి గుడిసెవాసులకు ధైర్యాన్ని కల్పించారు. అనంతరం జిల్లా సీపీఐ(ఎం) నాయకులు ఎం.సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో వాటికోసం ఎదురుచూస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారన్నారు. అలా భూపోరాటం చేసి వేసుకున్న గుడిసెలను పోలీసులు బుల్డోజర్లతో కూల్చి, కాల్చివేయడం దుర్మార్గమన్నారు. మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, బూటు కాళ్లతో మహిళలను పొత్తికడుపులో తన్నడం.. పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయమన్నారు. ఇదెట్లా ఫ్రెండ్లీ పోలీస్ అవుతుందని పోలీసులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వం పేదలు జానెడు జాగ కోసం అడిగితే తిట్టడం, కొట్టడం, కేసులు పెట్టడం నిర్బంధించడం, గుడిసెలు కాల్చడం సరైన పద్ధతి కాదన్నారు. భూ పోరాటంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, వారిని అణిచివేయాలని చూస్తే మహిళల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి పోరాడిన విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి జక్కలొద్ది భూములను పేదలకు పంచి పట్టాలు ఇవ్వడంతో పాటుగా ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, ఐద్వా జిల్లా కార్యదర్శి రత్నమాల, సీపీఐ(ఎం) నాయకులు ఆరూరి కుమార్, దుర్గయ్య, ఓదేలు, ప్రశాంత్, మాధవి, గుడిసెవాసులు పాల్గొన్నారు.