Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ముందు ధర్నా
- కోయపోశగూడ నుంచి ఉట్నూర్ వరకు పాదయాత్ర
- కేసులు ఎత్తేయాలని డిమాండ్
నవతెలంగాణ-ఉట్నూర్
పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసులు దండుగా కదిలారు. గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి నాలుగో రోజు ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. హక్కు పత్రాలు ఇవ్వాలని, కోయపోశగూడ ఆదివాసీ
మహిళలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని ఆదివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ ముందు తొమ్మిది ఆదివాసీ తెగల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. దండేపల్లి మండలం కోయపోశగూడ నుంచి ఈనెల 10న ప్రారంభమైన పాదయాత్ర సోమవారం ఉట్నూర్ ఐటీడీఏకు చేరుకుంది. సుమారు రెండున్నర గంటలపాటు ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు దశబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను ఏజెన్సీ ప్రాంతంలో ఆటవీ శాఖ అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు పోడు సాగు చేసుకున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఆరు నెలల కింద పోడు భూముల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రస్తుతం ఖరీప్ పనులు ప్రారంభమై విత్తనాలు విత్తుకునేందుకు పోడు రైతులు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆటవీ అధికారులు అడ్డుకోవడం, పోడు భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం, కందకాలు తవ్వడం వంటివి చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోయపోశగూడ ఆదివాసులు సాగు చేసుకునేందుకు అధికారులు సహకరించాలని, ఆదివాసీ మహిళలపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో సాగును అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటే సహించేది లేదని, ప్రాణం పోయినా భూములను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఐటీడీఏ పీఓ వరుణ్రెడ్డి ధర్నా వద్దకు వచ్చి సమస్యలు విన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, జిల్లా కార్యదర్శి పూసం సచిన్, సీపీఐ(ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి నంది రామయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణి, రాష్ట్ర, జిల్లా నాయకులు దౌలత్రావు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.